Sonia Gandhi: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ నెలకొంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీఏ భావిస్తోంది. మరోవైపు విపక్షాలన్నీ ఇండియా కూటమి పేరిట అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇండియా కూటమి నాయకత్వ విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె యోచిస్తున్నట్లు సమాచారం. ఆరోగ్యం సహకరించకపోవడం ఒక కారణం అయితే.. తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కోసం తన సీటు కేటాయించాలనుకోవడం మరో కారణంగా తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గం నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి ప్రతి ఎన్నికల్లో ఆమె ఎన్నికవుతూ వస్తున్నారు. ఎన్డీఏ ప్రభంజనం సృష్టించిన 2014, 2019 ఎన్నికల్లో సైతం సోనియాగాంధీకి ఎదురు లేకుండా పోయింది. కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గంగా రాయ్ బరేలి ఉంది. 2024 ఎన్నికల్లో సోనియా పోటీ చేసినా సునాయాసంగా గెలుపు పొందుతారని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈసారి తాను పోటీచేయనని సోనియా పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ స్థానాన్ని ప్రియాంక గాంధీ వాద్రాకు కేటాయిస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అవసరమైతే సోనియా రాజ్యసభకు ఎన్నిక కావాలని భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి సోనియా గాంధీని ఓడించాలని బిజెపి కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో అమేధీ నుంచి రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిజెపి సోనియా గాంధీ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందుకే ఆ నియోజకవర్గాన్ని ప్రియాంకకు అప్పగించి.. రాజ్యసభకు ఎన్నిక కావాలని సోనియా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏదో ఒక రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఎన్నికకు కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాయ్ బరేలి ఇన్చార్జిగా ప్రియాంక గాంధీని అతి త్వరలో నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.