IAS Anupriya Dubey: అధికారం మన చేతుల్లో ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే. ఎంతటి పనైనా ఇట్టే చేసుకోవచ్చు. ఎందరినైనా తమ వైపు తిప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తమ చెప్పుచేతల్లో ఉద్యోగులను ఉంచుకోవడం పరిపాటే. ఇదే కోణంలో వారు చేసే దురాగాతాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే వారు అధికారంలో పెద్ద కావడంతో ఎవరు కూడా ఎదురు చెప్పరు. వారు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుంది. దీంతో వారు చెప్పిందే వేదం. చేసిందే శాసనం. వారికి ఉన్న అధికారాలను విచక్షణారహితంగా ఉపయోగించి స్వార్థంతో వ్యవహరిస్తున్నారు.

అనుప్రియ దూబే ఓ ఐఏఎస్ అదికారి. ఆమె ఇంట్లో ఆవుకు ఆరోగ్యం బాగా లేదని పశువైద్యాధికారికి పురమాయించడంతో అతడు ఏడుగురు సిబ్బందితో ఆవుకు ఏడు రోజులుగా వైద్యం చేస్తూ రోజూ దాని ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని పేపర్ మీద ఆదేశాలు జారీ చేయడంతో వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది. ఇదంతా జరగడానికి ఆమెకు ఉన్న అధికారాలే కారణం. దీంతో ఆమె అధికారాల్ని ఉపయోగించుకుని కింది స్థాయి ఉద్యోగుల్ని తమ సొంత పనులు చేయడానికి ఇలా చేయడం విమర్శలకు తావిస్తోంది.

పసిపిల్లల్ని కూడా సరిగా చూసుకోలేని రాష్ట్రంలో ఇలాంటి దురాగాతాలు చోటుచేసుకోవడం మామూలే. పిల్లలకు సరైన ఆరోగ్య చికిత్సలు అందక చనిపోయిన సంఘటనలున్నాయి. దీంతో ఆక్సిజన్ కొరతతో 77 మంది పిల్లలు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. వారి విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. అయినా వారిలో మార్పులు మాత్రం రావడం లేదు.

ఐదేళ్లు అధికారంలో ఉండే రాజకీయ నాయకులను మనం విమర్శిస్తుంటాం. మరి వీరు 35 ఏళ్లు సర్వీసులో ఉంటూ అధికార ద్రోహానికి పాల్పడితే మాత్రం శిక్షలు ఉండవా? వారిపై ఎలాంట చర్యలు తీసుకోరా? ఐఏఎస్ లైతే ఏమైనా కొమ్ములుంటాయా? మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ లపై పలు విమర్శలు వచ్చిన సంగతి విధితమే. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఓ అదికారి ఓ పెద్ద కంపెనీకి తలొగ్గి విచ్చలవిడిగా లంచాలు తీసుకుని తన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేసినట్లు తెలిసిందే. అప్పట్లో దీనిపై పలు ఆరోపణలు సైతం వచ్చాయి. కానీ వారిపై ఎలాంటి శిక్షలు ఉండటం లేదు.