BJP: లోక్‌సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తోంది కేంద్రంలోని అధికార బీజేపీ. ఈమేరకు దూకుడు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 195 మందితో తొలిజాబితా విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో మరో 100 నుంచి 150 మందితో రెండో లిస్ట్ రిలీజ్ చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో తెలంగాణలో ఏడుగురికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
తెలంగాణలో 9 మంది ప్రకటన..
బీజేపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తోంది. ఏపీలో బీజేపీ–టీడీపీ–జనసేన కూటమి పోటీ చేస్తోంది. దీంతో తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక రెండో లిస్ట్‌లో పూర్తి చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, మల్కాజిగి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత పోటీ చేయనున్నారు. జహీరాబాద్ నుంచి బీబీ.పాటిల్, నాగర్‌కర్నూల్ నుంచి భరత్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.
రెండె లిస్ట్‌లో ఎవరంటే..
ఇక నేడో రేపో బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో తెలంగాణకు చెందిన ఏడుగురి పేర్లు ఉంటాయని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే.అరుణ, మెదక్ నుంచి రఘునందన్‌రావు, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, నల్లగొండ నుంచి శానం సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ పేర్లు ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఆదిలాబాద్ సీటుపై పీఠముడి..
ఇక మిగిలిన ఒక్కసీటు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానిది. దీనిపైనే పీఠముడి నెలకొంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావు ఉన్నారు. ఆయనను మొదటి లిస్టులో పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత గొడం నగేష్ ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన రమేశ్‌రాథోడ్, రాథోడ్ బాపూరావు, సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు ఢిల్లీ వెళ్లారు. నగేష్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.