IPS Manoj Kumar Sharma: ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ… సిఐఎస్ఎఫ్ విభాగంలో కీలక అధికారి. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించింది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరించనున్న 37 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిలో ఈయన ఒకరు కావడం గమనార్హం. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐపీఎస్ కు ఎంపికైన మనోజ్ కుమార్ శర్మ ఇంటర్మీడియట్లో ఫెయిలయ్యారు. అయినా మొక్కవోని దీక్షతో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన నిజజీవితం ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో ’12th ఫెయిల్ ‘అనే సినిమా వచ్చింది.ఇప్పుడు ఆయనే రియల్ లైఫ్ లోనూ హీరోగా నిలవడం విశేషం.
మనోజ్ కుమార్ శర్మ 2005 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన వారు. ఈయన భార్య శ్రద్ధ జోషి ఐఆర్ఎస్ అధికారి. మధ్యప్రదేశ్లోని ఓ కు గ్రామానికి చెందిన శర్మ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సరైన విద్యా వసతులు లేని సమయంలో విద్యను అభ్యసించారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు కూడా. అయినప్పటికీ ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో డిగ్రీ పూర్తి చేశారు. యుపీఎస్సీకి సిద్ధమయ్యారు. మూడుసార్లు విఫలమై.. నాలుగో ప్రయత్నంలో భాగంగా ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రద్ధాను వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ కథను శర్మ స్నేహితుడు అనురాగ్ పాఠక్ నవలగా మలిచారు. ఆ నవల బహుళ ప్రాచుర్యం పొందింది. దానిని ఆధారంగా చేసుకుని విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ సినిమాను రూపొందించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది ఈ చిత్రం.
ఇప్పుడు రియల్ హీరో మనోజ్ కుమార్ శర్మ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకానికి ఎంపిక చేసింది. ప్రస్తుతం శర్మ ఢిల్లీ ఎయిర్ పోర్టు చీఫ్ ఎయిర్ పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నారు. శర్మ బ్యాచ్ మేట్ అయిన మరో అధికారి జితేందర్ రాణా ముంబై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. మొత్తం 37 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందికి సేవా పథకాలు ప్రకటించగా.. అందులో స్నేహితులైన శర్మ, జితేందర్ రాణా ఉండడం విశేషం. నిజజీవితంలో సైతం మనోజ్ కుమార్ శర్మ హీరోగా నిలిచారని సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందిస్తున్నారు. అటు 12 th ఫెయిల్ చిత్ర యూనిట్ సైతం తమ అభినందనలను తెలిపింది.