PM Modi RSS: దేశంలో కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్రమోదీ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ విషయాన్ని తరచూ తెరపైకి తెస్తోంది. లైవ్‌లో ఉండేలా చూసుకుంటోంది. సెప్టెంబర్‌తో మోదీకి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ నిబంధన ప్రకారం మోదీ రిటైర్ కావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఆడరాక మద్దెల ఓడు అన్న చందంగా.. మోదీ ఉంటే 2029లో కూడా తాము గెలవలేమన్న భావనతో మోదీ రిటైర్మెంట్ గురించి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కన్నా కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తాజాగా జైరాం రమేశ్ కూడా మోదీ రిటైర్మెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ పదవీకాలం సెప్టెంబర్ తర్వాత కొనసాగడం ఆర్‌ఎస్‌ఎస్ ఆశీర్వాదాలపై ఆధారపడి ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: మన దేశ ప్రెసిడెంట్ వర్షంలో.. అదే అమెరికాలో వాళ్ళ ప్రెసిడెంట్ ని వర్షంలో తడవనిస్తారా?
బీజేపీ రాజకీయాల్లో అదృశ్య శక్తి..
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ భావజాలానికి మూలం. హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహించే ఈ సంస్థ, బీజేపీ నాయకత్వ ఎంపికలో, విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మోదీ, గతంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పనిచేసిన వ్యక్తిగా, సంఘ్‌తో గాఢమైన సంబంధం కలిగి ఉన్నారు. ఈ సంబంధం, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ ఒక బలమైన పునాదిగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు లేకుండా మోదీ నాయకత్వం సవాళ్లను ఎదుర్కొంటుందనే అభిప్రాయం ఊపందుకుంది.
మోహన్ భగవత్ ప్రభావం..
మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్‌గా, సంఘ్ దిశానిర్దేశకుడిగా ఉన్నారు. ఆయన అభిప్రాయాలు, సలహాలు బీజేపీ రాజకీయ వ్యూహాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ తన ప్రసంగాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రస్తావిస్తున్నారు. భగవత్‌ను సమాధానపరచాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఇది మోదీ∙రాజకీయ బలహీనతను సూచిస్తుందా? లేక సంఘ్‌తో సామరస్య సంబంధాలను కొనసాగించే వ్యూహమా? ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మోదీ అంత బలహీనుడా..?
ప్రధాని మోదీ బలహీన నాయకుడిగా మారారని, ఆయన పదవీకాలం సెప్టెంబర్ తర్వాత సంఘ్ దయపై ఆధారపడి ఉందని కొందరు వాదిస్తున్నారు. మోదీ, గత దశాబ్ద కాలంగా బీజేపీని బలమైన నాయకత్వంతో ముందుకు నడిపించారు. ఆయన నిర్ణయాత్మక నాయకత్వ శైలి, జనాదరణ ఆధారిత విధానాలు బీజేపీని జాతీయ స్థాయిలో బలపరిచాయి. అయినప్పటికీ, ఇటీవలి కాలంలో పలు సవాళ్లు ఆర్థిక సంక్షోభం, రాజకీయ ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల తగ్గుదల మోదీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ పరిస్థితుల్లో, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఆయనకు కీలకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.
సెప్టెంబర్ తర్వాత ఏం జరుగుతుంది?
సెప్టెంబర్ తర్వాత మోదీ పదవీకాలం ఆర్‌ఎస్‌ఎస్ ఆశీర్వాదాలపై ఆధారపడి ఉందనే వాదనలు ఊహాగానాలకు దారితీస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలో నాయకత్వ మార్పులపై నిర్ణయాత్మక అధికారం కలిగి ఉందని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు. అయితే, మోదీ వంటి జనాదరణ కలిగిన నాయకుడు పూర్తిగా సంఘ్ దయపై ఆధారపడతారని ఊహించడం కూడా సరికాదు. ఆయన రాజకీయ వ్యూహం, ప్రజాభిమానం, అంతర్జాతీయ గుర్తింపు ఇప్పటికీ ఆయన పదవీకాలాన్ని కొనసాగించేందుకు బలమైన అంశాలుగా ఉన్నాయి.