Polio Day 2024: ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు ఎందుకు వేయించాలంటే..

పోలియో పోలియో మైలైటీస్ కు సంక్షిప్త రూపం. ఈ వైరస్ నాడీ వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. పైగా ఇది అంటువ్యాధి. ఈ వ్యాధి పురాతన కాలం నుంచి కూడా ఉందని ఆధారాలు లభించాయి.

Written By: Velishala Suresh, Updated On : March 3, 2024 4:13 pm
Follow us on

Polio Day 2024: కాళ్ళు, చేతులు సరిగ్గా కదిలితేనే మనమేదైనా పని చేయగలం. అలా పని చేస్తేనే మన జీవితాన్ని సౌకర్యవంతంగా జీవించగలం. అలా కాళ్లు, చేతులు పని చేయకుంటే చాలా కష్టం. కన్నవాళ్ళకు భారంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వైకల్యం గతంలో పోలియో వైరస్ వల్ల వ్యాపించేది. దీనివల్ల చాలామంది వైకల్యంతో బాధపడేవారు. వెనుకటి రోజుల్లో వైద్యం ఇంతలా అభివృద్ధి చెందలేదు కాబట్టి చాలామంది పుట్టుకతోనే వికలాంగులుగా జన్మించేవారు. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడేవారు. ఇలా వైకల్యంతో పిల్లలు పుడితే.. అది అంతిమంగా దేశ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని భావించి ప్రభుత్వాలు పోలియో నిర్మూలనకు నడుంబిగించాయి. అందుకే దేశవ్యాప్తంగా పల్స్ పోలియో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. మార్చి మూడు ఆదివారం దేశవ్యాప్తంగా పల్స్ పోలియో దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఈ పోలియో చుక్కల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

పోలియో పోలియో మైలైటీస్ కు సంక్షిప్త రూపం. ఈ వైరస్ నాడీ వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. పైగా ఇది అంటువ్యాధి. ఈ వ్యాధి పురాతన కాలం నుంచి కూడా ఉందని ఆధారాలు లభించాయి. ముఖ్యంగా పోలియో వైరస్ మెదడు, నరాలను ప్రభావితం చేస్తుంది. కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తిని తాకితే వారికి కూడా వ్యాపిస్తుంది. పోలియో సోకిన చాలామందికి మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వైరస్ సంక్రమణ పెరుగుతున్నకొద్దీ జ్వరం, తలనొప్పి, కండరాలనొప్పి, గొంతునొప్పి, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి అది పక్షవాతానికి కూడా దారి తీయవచ్చు. అనంతరం కాలు లేదా చేయి అవయవాలు చచ్చు పడిపోతాయి. ఒకవేళ వైరస్ తీవ్రత అధికంగా ఉంటే కాళ్లు, చేతులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం.. 1995లో భారత్ 100% పోలియో నిర్మూలనే ధ్యేయంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 13 2023 నాటికి ఈ కార్యక్రమం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సీడీసీ ప్రకారం పిల్లలకు నాలుగు డోసుల పోలియో వ్యాక్సిన్ వేయాలి. మొదటి డోస్ రెండు నెలల వయసులో ఉన్నప్పుడు, రెండవ డోస్ నాలుగు నెలల వయసులో ఉన్నప్పుడు ఇవ్వాలి. తదుపరి డోస్ లు ఆరు నెలల నుంచి 18 నెలల వయసు వరకు, నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం లోకి పోలియో వైరస్ వ్యాపించే అవకాశం ఉండదు. ఫలితంగా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు పోలియో వైరస్ వల్ల వైకల్యం బారిన పడితే అది దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది.