PM Modi: కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. బిజెపి ఒంటరిగా 370, ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కలిసి 400 లోక్ సభ స్థానాలను టార్గెట్ చేసుకున్నారు. ఆదిశగా గట్టిగానే కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పట్టు బిగించాలని భావిస్తున్నారు. ఆదిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.గత ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఈసారి ఏపీ, తమిళనాడు, కేరళలో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది. కొత్త పొత్తులతో ముందుకు సాగుతోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలు ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో 130 నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో కర్ణాటకలో 28 స్థానాలకు గాను 25, తెలంగాణలో 17 సీట్లకు గాను నాలుగు స్థానాలను బిజెపి గెలుపొందింది. కానీ ఏపీ, తమిళనాడు, కేరళలో మాత్రం కనీస ప్రాతినిధ్యం లేదు. గత ఎన్నికల నాటికి అధికారంలో ఉన్న కర్ణాటకను సైతం బిజెపి వదులుకుంది. అందుకే అక్కడ పొత్తులతో వీలైనంత ఎక్కువ సీట్లు పొందాలని చూస్తోంది. ఏపీలో సైతం టిడిపి, జనసేన లతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో సైతం ఈసారి గణనీయమైన సీట్లు దక్కించుకోవాలని చూస్తోంది.
ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండడంతో అక్కడ అనుకున్న సీట్లు సులువుగా పొందవచ్చని బిజెపి భావిస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పొత్తులో భాగంగా భాగస్వామ్య పార్టీల సహకారంతో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోవాలని చూస్తోంది. అందుకే ప్రధాని మోదీ వరుస పర్యటనలతో దక్షిణాది రాష్ట్రాలను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మార్చి 19 వరకు వరుసగా ఐదు రోజులపాటు విస్తృత ప్రచారం చేయనున్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు.. శుక్రవారం కేరళ, తమిళనాడు, తెలంగాణ,రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు జరిపారు. ఈనెల 17న టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఉమ్మడి బహిరంగ సభలో మోది పాల్గొనున్నారు. 18న తమిళనాడులోని కోయంబత్తూర్ లో ప్రధాని రోడ్ షో ఉండనుంది.దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ,ఏపీ ఫై బిజెపి ఆశలు పెట్టుకుంది. పొత్తుల్లో భాగంగా దక్కిన సీట్లలో విజయానికి గట్టిగానే కృషి చేస్తోంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.