Omicron:కమ్ముకొస్తున్న కారు మేఘాలు అని మనం ప్రాస కోసం వాడుతాం.. కానీ ప్రపంచాన్ని భయపెడుతున్న ‘ఒమిక్రాన్’ వైరస్ ముప్పు ఇప్పుడు భారత్ ను అల్లకల్లోలం చేయడం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ కు కారణమై కొన్ని లక్షలమందిని చంపిన ‘డెల్టా’ వేరియంట్ కన్నా అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం ఈ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ సొంతం. ఇప్పటికే అమెరికా, యూరప్ లో రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతూ ఆ దేశాలన్నీ ఆంక్షల వలయంలోకి చిక్కాయి. యూరప్ లోని పలు దేశాలు లాక్ డౌన్ కూడా విధించాయి. ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ ముప్పు ఈ చలికాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపించడం కలవరపెడుతోంది.
డెల్టా రకం కన్నా అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగిన ఈ కొత్త వేరియంట్ కేసులు ఇప్పటికే మన దేశంలో 2015 నమోదయ్యాయి. ఒమిక్రాన్ పెరగడంతో ఈ మహమ్మారి ముప్పు నుంచి దేశం ఎలా బయటపడుతుందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
ఈ క్రమంలోనే దేశంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పేలా లేదని నిపుణులు అంచనావేస్తున్నారు. మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయంటున్నారు. స్కూళ్లు మూతపడడం ఖాయమంటున్నారు. ఇక ఉద్యోగ, వ్యాపార, ఇతర రంగాలు కూడా మూతబడి ఇంటినుంచే పని మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో ప్రస్తుత వేగం చూస్తే ఫిబ్రవరి వరకూ పతాకస్థాయికి చేరడం ఖాయమని… దేశంలో ఫిబ్రవరిలో లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేజరిగే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు.. పేద ప్రజల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేలా పలువురు నిపుణులు ముందే హెచ్చరికలు చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ టీకా వేసుకోవాలని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే లాక్ డౌన్ తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పూర్తిగా పోయి చాలా రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వాలు, దిగ్గజ సంస్థలు సైతం అప్పులపాలై ఇప్పటికీ కోలుకోవడం లేదు. మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఇక అథోగతియే. అందుకే ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అందరూ టీకాలు వేసుకొని.. భౌతిక దూరం పాటిస్తూ మహమ్మారి బారిన పడకుండా ఉండడమే ఏకైక మార్గం.. ఆ దిశగా ప్రజలు తమకు తాము నియంత్రణ చర్యలు తీసుకుంటేనే దేశంలో థర్డ్ వేవ్ ముప్పును తప్పించవచ్చు. లేదంటే మరోసారి దేశంలో భీతావాహ ఘటనలు జరగడం ఖాయం.