Antarctica Sea Ice: మొన్న కురిసిన వర్షాలకు రాష్ట్ర మొత్తం అతలాకుతలమైపోయింది. దేశంలో ఉత్తరాది ప్రాంతంలోనూ ఇదే స్థాయిలో వర్షాలు కురిశాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. అయితే మొన్నటిదాకా ఎల్ నినో వల్ల వర్షాలు కురవవని వాతావరణ శాఖ అధికారులు తేల్చి చెప్పేశారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ వర్షాలు విపరీతంగా కురిశాయి. ఏడాది మొత్తం కురిసే వర్షాలు కేవలం ఒక్కరోజులోనే కురవడంతో నష్టం తీవ్రత అధికంగా ఉంది. వాస్తవానికి ఈ స్థాయిలో వర్షాలు కురవడం వెనక ప్రకృతి గతి తప్పడమే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. అంతేకాదు అంటార్కిటికా ఖండంలో మంచు కరగడం కూడా ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.
భారత్ లో వర్షాలు విపరీతంగా కురుస్తుంటే.. ఉత్తరార్థ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో భారీగా మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగిపోయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి అంటార్కిటికా ఖండంలో వేసవికాలంలో మంచు కరిగిపోతుంది. తర్వాత శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. ఇలా ఉత్పరివర్తనాలు జరగడం వల్లే భారత దేశంలో విపరీతంగా పరీక్షలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
అంటార్కిటికా ఖండంలో గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే 1981_2010 కాలం మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలారాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటీకాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోతుంది. ఇది చాలా అసాధారణ పరిణామమని , 10 లక్షల సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే.. అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్యకారక ఉద్గారాలను ఇష్టానుసారంగా వాతావరణంలోకి విడుదల చేస్తుండడంతో వాతావరణం గతి తప్పుతోంది. దీనివల్ల అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి రకరకాల ప్రతికూలతలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే మంచు కరగడం వల్ల సముద్రపు మట్టం పెరుగుతోంది. దీనివల్ల తీర ప్రాంత నగరాలు నీటిలో మునిగే ప్రమాదం పొంచి ఉంది. గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో విపరీతంగా వర్షాలు కురవడం వల్ల వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది.