Manipur Incident : రాహుల్‌గాంధీపై స్పందించిన తీరు.. మణిపూర్‌ మీద లేదేం?

నిజానికి మణిపూర్‌లో హింస తలెత్తిన రెండు రోజులకే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 355 కింద శాంతి భద్రతలను తన చేతిలోకి తీసుకుంది. కేంద్రం నియంత్రణలో ఉన్న మణిపూర్‌కు తన బృందాన్ని పంపలేనని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్వయంగా వ్యక్తం చేయడం విశేషం.

Written By: Bhaskar, Updated On : July 23, 2023 10:35 am
Follow us on

Manipur Incident : ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగిస్తుంటే దాన్ని ఏమనుకోవాలి? అందరూ చూస్తుండగానే అత్యాచారం చేస్తుంటే ఆ ఘాతుకానికి ఏం పేరు పెట్టాలి? ఇవే కాదు చాలా దారుణాలు, మరెన్నో ఘోరాలు.. ఓట్ల లెక్కల్లో ఉండే పార్టీలకు ఇవేవీ పట్టవు. అధికార పార్టీ మేము బాగానే పని చేస్తున్నామని చెప్పుకుంటుంది. ప్రతిపక్షమేమో అదిగో చూశారా దారుణం అని గగ్గోలు పెడుతుంది. ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తుంటాయి. కానీ ఇలాంటప్పుడే రాజ్యాంగ సంస్థలు తమ పని తాము చేయాలి. కట్టు తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టాలి. అవసరం అయితే చర్నాకోల్‌ అందుకుని చెమడలు ఊడతీయాలి. నడిబజారులో నిలబెట్టాలి. నిలువునా కడిగేయాలి. మరి మణిపూర్‌లో జరుగుతున్న దారుణాల్లో మన రాజ్యాంగ సంస్థలు ముఖ్యంగా జాతీయ మహిళా కమిషన్‌ స్పందిస్తున్న తీరు ఎలా ఉంది?
నిరాటంకం
మణిపూర్‌లో మారణహోమం నిరాటంకంగా సాగు తోంది. 2 నెలలుగా కొనసాగుతూ మహిళలు, పిల్లలు సమిధలవుతున్నారు. ప్రపంచం నలు మూలల నుంచి  ఆగ్రహా వేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా కమిషన్‌ జోక్యం కోరుతూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. చైర్‌పర్సన్‌ రేఖాశర్మ మాత్రం ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఇదే రేఖా శర్మ 2019లో రాహుల్‌గాంధీ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు వెంటనే స్పందించారు. కమిషన్‌ తరఫున నోటీసులు ఇచ్చారు. ఇంతకీ ఆయనన్న మాట ఏం టంటే ‘పార్లమెంటులో తనను తాను సమర్థించుకోవడానికి భయపడిన మోడీ మహిళ(నిర్మలా సీతారామన్‌)కు ఆ బాధ్యత అప్పగించి దాక్కున్నారని’ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నోటీసులు ఇచ్చి, రాహుల్‌ సమాధానం ఇచ్చే వరకు వదలని రేఖాశర్మ.. మణిపూర్‌ విషయంలో మాత్రం తనకు ఏం సంబంధం లేనట్లు వ్యవహరిండం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కమిషన్‌ స్పందించలేదు
మే 4న ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన  యువకుల వీడియో 19న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి నార్త్‌ అమెరికా మణిపూర్‌ ట్రైబల్‌ అసోసియేషన్‌(నామ్టా) ఆందోళన వ్యక్తం చేసింది. జూన్‌ 12నే జాతీయ మహిళా కమిషన్‌కు ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. నెల గడిచినా ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్‌ ఏ మాత్రం స్పందించలేదు. మహిళా కమిషన్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో తప్పనిసరై రేఖాశర్మ మాట్లాడారు ‘మే 4 ఘటనకు సంబంధించి తనకు ఎలాంటి నివేదిక అందలేదు. ఈ నెల 19న సోషల్‌ మీడియాలో వీడియో వెలుగులోకి రావడంతో తానే స్వచ్ఛందంగా విచారణకు ఆదేశించాను. అయితే, మణిపూర్‌ మహిళలపై అఘాయిత్యాల గురించి స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పంపించాను. ఎలాంటి సమాధానం రాకపోవడంతో మూడు సార్లు వాళ్లకు గుర్తు చేశాను’ అని వ్యాఖ్యానించారు. నామ్టా ఫిర్యాదు గురించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు ‘‘జరిగాయని చెబుతున్న ఘటనలను ధ్రువీకరించుకోవాలి కదా. అందునా ఫిర్యాదులు మణిపూర్‌ నుంచి రాలేదు. కొన్ని ఫిర్యాదులు ఈ దేశం నుంచి వచ్చినవి కూడా కాదు. అయినా, నా దగ్గరకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పంపాం’’ అని పేర్కొన్నారు. నిజానికి మణిపూర్‌లో హింస తలెత్తిన రెండు రోజులకే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 355 కింద శాంతి భద్రతలను తన చేతిలోకి తీసుకుంది. కేంద్రం నియంత్రణలో ఉన్న మణిపూర్‌కు తన బృందాన్ని పంపలేనని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వయంగా అశక్తత వ్యక్తం చేయడం ఆ రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నియంత్రణ లేదని రేఖా శర్మ చెప్పడం విశేషం.