Mumbai Mosques: భారత దేశం లౌకిక రాజ్యం. ఇటీవల లౌకిక, సోషలిస్టు పదాలను కూడా రాజ్యాంగం నుంచి తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉంచితే.. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రధానమైనవి మాత్రం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మతాలు ఉన్నాయి. దేశంలో ఎవరి దేవుడిని వారు ప్రార్థించుకునే స్వేచ్ఛ ఉంది. అయితే ఈ పేరుతో వేడుకలు, ఉత్సవాలు, ప్రార్థనా మందిరాల వద్ద లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి శబ్దకాలుష్యం పెంచుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు శబ్ద కాలుష్య నియంత్రణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ ఆదేశాలు కొన్ని రాష్ట్రాల్లోనే అమలవుతున్నాయి. తాజాగా ముంబైలోని ఆరు మసీదులు శబ్దకాలుష్య నియంత్రణకు అజాన్ నిలిపివేశాయి.
నిర్ణయం వెనుక నేపథ్యం..
ముంబైలోని ఆరు మసీదులు అజాన్(ప్రార్థనకు పిలుపు) కోసం లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నిలిపివేసినట్లు తాజా ప్రకటించాయి. ఈ నిర్ణయం శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాలను గౌరవించడంతోపాటు, సామాజిక సామరస్యాన్ని కాపాడే లక్ష్యంతో తీసుకోబడినట్లు తెలిపాయి. శబ్ద కాలుష్య నియమాల ప్రకారం.. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నిషేధిస్తాయి, ఈమేరకు సుప్రీం కోర్టు 2005లోనే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని కొన్ని మసీదులు స్వచ్ఛందంగా లౌడ్‌స్పీకర్లను తొలగించి, శబ్ద స్థాయిలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నాయి.
ఎప్పటి నుంచో డిమాండ్..
2022లో, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాకరే మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. స్పీకర్లు తొలగించకుంటే హనుమాన్ చాలీసాను లౌడ్‌స్పీకర్లలో ప్రసారం చేస్తామని హెచ్చరించారు. ఈ వివాదం శబ్ద కాలుష్య నియమాలను కఠినంగా అమలు చేయాలన్న ఒత్తిడిని పెంచింది. అయితే, 26 మసీదులు 2022లోనే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లౌడ్‌స్పీకర్లను ఉపయోగించకూడదని నిర్ణయించాయి,
యాప్‌లో అజాన్..
తాజాగా ముంబైలోని ఆరు మసీదులు కూడా అజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించొద్దని నిర్ణయించాయి. అయితే అజాన్‌ను పూర్తిగా నిలిపివేయలేదు. సామూహికంగా, ఇస్లాంను నమ్మేవారికి అజాన్ సమయం తెలిసేలా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చాయి. తమిళనాడుకు చెందిన నిపుణులు తయారుచేసిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు మత పెద్దలు. మహిమ్‌లోని బిస్మిల్లా మసీదు “OnlineAzan’ అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించింది, ఇది అజాన్‌ను లైవ్‌గా ప్రసారం చేస్తుంది. ఈ యాప్ ద్వారా భక్తులు తమకు సమీపంలోని మసీదు నుంచి అజాన్‌ను వినవచ్చు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మతపరమైన ఆచారాలను కొనసాగించవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే 1,200 మంది భక్తులు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారని, ఇది స్థానికంగా అభివృద్ధి చేయబడిన యాప్ కావడం వల్ల డేటా భద్రతపై ఆందోళనలు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి.
స్వాగతిస్తున్న పర్యావరణవేత్తలు..
ముంబైలోని మసీదుల నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. చాలా మంది ఈ నిర్ణయాన్ని శబ్ద కాలుష్య నియంత్రణకు మద్దతుగా స్వాగతిస్తుండగా, మరికొందరు దీనిని మతపరమైన స్వేచ్ఛపై ఆంక్షలుగా భావిస్తున్నారు. ముంబై పోలీసు కమిషనర్ దీనిని చట్టపరమైన అమలు చర్యగా సమర్థించారు, శబ్ద నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.