M S Swaminathan: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత హరిత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గురువారం కన్నుమూశారు. భారతదేశం కరువుతో అల్లాడుతున్నప్పుడు అధిక దిగుబడిని ఇచ్చే వరి, గోధుమ వంగడాలను సృష్టించి లక్షలాదిమంది క్షుద్భాదను తీర్చారు. 98 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. స్వామినాథన్ దేశ ఆహార భద్రతకు పెద్దపీట వేశారు. భారతీయ హరిత విప్లవానికి నాంది పలికారు. వ్యవసాయ రంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. చైనా నుంచి దిగుబడులు ఇచ్చే వారి వంగడాలను సృష్టించారు. ఈ వరి వంగడాలను సృష్టించేందుకు ఆయన అనేక నిద్రలేని రాత్రులను గడిపారు. తక్కువ ఆదాయమున్న రైతులకు దిగుబడిని పెంచి అనేక పద్ధతులను నేర్పారు.
ఆయన చేసిన కృషికి గాను 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పురస్కారం దక్కింది. ఆ తర్వాత చెన్నైలో స్వామినాథన్ ఒక రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అనేక వంగడాలు సృష్టించారు. ఈ వంగడాలు సృష్టించినందుకు గానూ పలు అంతర్జాతీయ పురస్కారాలు స్వామినాథన్ అందుకున్నారు. 1971లో ఆయన రామన్ మొగస్సేసే అవార్డును సొంతం చేసుకున్నారు. 1986లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. స్వామినాథన్ కు భార్య మీనా తో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌమ్య స్వామినాథన్ చీఫ్ సైంటిస్ట్ గా కొనసాగుతున్నారు. స్వామినాథన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు ప్రకటించారు.