BJP Vs TDP: తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు.అవినీతి ఆరోపణ కేసులతో మూడు వారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలో పార్టీ శ్రేణుల వ్యవహార శైలి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయస్థాయిలో ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.
ఇప్పటికే చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. బిజెపితో తమకు వైరం లేదని.. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో వచ్చిన గ్యాప్ తోనే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేన, టిడిపి కలిసి వెళ్తాయని సంకేతాలు ఇచ్చారు. తాజాగా పవన్ టిడిపి తో పొత్తు ప్రకటన చేసే క్రమంలో బిజెపిని తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు జాతీయస్థాయిలో బిజెపి ప్రత్యర్థి పార్టీలను ఆశ్రయిస్తుండడం విశేషం. దీనిపై బిజెపి ఒకింత అనుమానం, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్కు బిజెపి పెద్దల ప్రోత్సాహం ఉందన్న ప్రచారం ఒకటి ఉంది. టిడిపి శ్రేణులు సైతం అదే అనుమానంతో ఉన్నాయి. అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు అయితే బిజెపి పాత్ర పై బలమైన అనుమానాలు వ్యక్తం చేశారు. అటు టిడిపి అనుకూల మీడియా సైతం బిజెపి పై అనుమానపు చూపులు చూసేలా కథనాలు ప్రచురించారు. ఎన్డీఏ ను అధికారంలో దించేందుకు ఇండియా కూటమి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు చేరాలనుకుంటున్న ఎన్ డి ఏ కూటమికంటే ఇండియా కూటమికి చెందిన నేతలే చంద్రబాబు అరెస్టుపై ముందుగా స్పందించారు. ఇది కూడా బిజెపి అనుమానాలకు కారణమవుతోంది.
చంద్రబాబు అరెస్టు తరువాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసిన తరువాతే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అఖిలేష్ యాదవ్ లాంటి నేతల విషయంలో సైతం అదే తరహా ప్రచారం జరిగింది. అటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించడాన్ని బిజెపి గమనిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎన్డీఏలో ఉన్న అన్నాడీఎంకేకు చెందిన మాజీ సీఎం పళని స్వామిని టిడిపి నేతలు కలిసి.. చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని కోరడం బిజెపికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకవైపు తమకు స్నేహ హస్తం అందిస్తూనే.. తమ వ్యతిరేకులతో అంటగాకెందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీపై బిజెపి అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.