HomeజాతీయంMamata Banerjee: ఇండియా కూటమికి మమతా బెనర్జీ గుడ్ బై!

Mamata Banerjee: ఇండియా కూటమికి మమతా బెనర్జీ గుడ్ బై!

Mamata Banerjee: సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తరువాతే తాము కూటమిలో చేరడంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని డిసైడ్ అయ్యాయి. దాదాపు 32 రాజకీయ పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చాయి. తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కూటమిగా ఎన్డీఏ ను ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ కూటమిని రద్దు చేసుకుని.. ఇండియా కూటమిగా అవతరించాయి. కానీ ఆది నుంచి నాయకత్వం విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ విషయంలో మమతా బెనర్జీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కు అభ్యంతరాలు ఉన్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో వీలైనంతవరకు భాగస్వామ్య పక్షాలు పొత్తు పెట్టుకోవాలని.. లేకుంటే స్నేహపూర్వక పోటీకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్ ల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 42 పార్లమెంట్ స్థానాలకు గాను ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కోరడంతో మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు. వీలైనంతవరకు ఒంటరి పోరుకు సిద్ధపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూటమిలో చేరాలా? వద్దా? అన్నది నిర్ణయించుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయం సంచలనం గా మారింది. కూటమిలో కీలక పార్టీ హ్యాండ్ ఇవ్వడం పై మిగతా భాగస్వామ్య పక్షాలు ఆందోళనకు గురవుతున్నాయి.

ఇండియా కూటమిలో అనైక్యత బిజెపికి వరంగా మారుతోంది. ఎన్డీఏ కు ఆయాచిత లబ్ధి కనిపిస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ నాయకత్వంపై ఇండియా కూటమిలో మిగతా రాజకీయ పక్షాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పెత్తనాన్ని సహించలేక బాహటంగానే విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అయితే తాము కూటమిలో ఉండలేమని తేల్చి చెప్పారు. ఒకానొక దశలో ఇండియా కూటమిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్ర ఉండకూడదని భావించారు. కూటమి చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే వరకు ఓకేనని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు కూటమి నాయకత్వం తమకే కావాలని అటు మమతా బెనర్జీ, ఇటు నితీష్ కుమార్ పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో స్వతంత్రంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావించింది. తమది జాతీయ పార్టీ అన్న విషయం గుర్తుంచుకోవాలని సంకేతాలు పంపింది. కూటమిలో సింహభాగ ప్రయోజనాలు తమకే లభించాలన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ పరిణామాల క్రమంలో కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీతో తృణమూల్ కాంగ్రెస్ విభేదించింది. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆ కూటమికి ఇదొక ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మమతా బెనర్జీ ఉపసంహరించుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular