https://oktelugu.com/

Kumara Swamy : కింగూ లేదు..బొంగూ లేదు.. చేతులెత్తేసిన కుమారస్వామి

కౌంటింగ్ వేళ ఏకంగా తమది చిన్నపార్టీ అని చెప్పుకోవడం కూడా ఓకింత అనుమానం వ్యక్తమవుతోంది. ముందే ఓటమి అంగీకరించారా? లేకుంటే వ్యూహమా అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది. 

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2023 11:50 am
    Follow us on

    Kumara Swamy : కర్నాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి ముందే చేతులెత్తేశారా? తమది చిన్న పార్టీ అని చెబుతుండడం దేనికి సంకేతం? నిన్నటి వరకూ బీజేపీ, కాంగ్రెస్ లు టచ్ ఉన్నాయని చెప్పిన ఆయన స్వరం మారింది ఎందుకు? అది వ్యూహమా? లేకుంటే భయమా? ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన వేళ కుమారస్వామి ప్రకటన కలకలం సృష్టిస్తోంది. కింగ్, కింగ్ మేకర్ గా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్న వేళ ఆయన అలా ఎందుకు ప్రకటన చేశారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకూ దీమాతో ఉన్న ఆయన ఎందుకో ఇప్పుడు భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు.  తమ పార్టీ చిన్న పార్టీ అని, తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం తమ అవసరం ఉండకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అంత డిమాండ్ కూడా లేదని చెప్పుకొచ్చారు.  తనను కనీసం బీజేపీ, కాంగ్రెస్ సంప్రదించలేదన్నారు.

    శిబిరాలు…
    ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అదే సమయంలో ప్రధాన రాజకీయ పక్షాలు శిబిరాలను కొనసాగిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థులను సేఫ్ జోన్ కు పంపించాయి. ప్రత్యర్థి పార్టీలతో పాటు గెలుపుగుర్రాలుగా భావించే ఇండిపెండెంట్లపై ఫోకస్ పెట్టాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం పావులు కదులుతున్నాయి. ఈసారి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడంతో పార్టీలు ముందుగానే అలెర్టయ్యాయి. ఇప్పటికే ఆపరేషన్ కమళానికి బీజేపీ నేతలు భారీ స్కెచ్ గీశారని వార్తలు వస్తున్నాయి.

    కాంగ్రెస్ దూకుడు..
    బీజేపీపై ఉన్న వ్యతిరేకతతో ఇక్కడ కాంగ్రెస్ పై సానుకూలత ఏర్పడింది. సీట్లపరంగా కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని తేలడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఏ చిన్న అవకాశం వదులుకోకూడదని కాంగ్రెస్ పార్టీ డిసైడయ్యింది. అందుకే తమ పార్టీ టిక్కెట్ దక్కక ఇండిపెండెంట్ గా పోటీచేసిన వారితో భేరసారాలు సాగిస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా గెలిచే అవకాశమున్న పది మంది ఇండిపెండెంట్లతో ఇప్పటికే సంప్రదంపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ కూడా క్యాంప్ రాజకీయాలకు తెర తీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలుపు అవకాశం ఉన్న ఎమ్మెల్యేలనే తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. స్వతంత్ర అభ్యర్థులను సైతం వదలకుండా బిజెపి క్యాంప్ రాజకీయాలు చేస్తోంది.

    అది వ్యూహమా?
    అయితే కర్నాటక ఎపిసోడ్ లో కుమారస్వామి మాట మార్చడమే హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకూ కింగ్ లం, కింగ్ మేకర్లమని చెప్పిన ఆయన తమది చిన్నపార్టీగా బాంబు పేల్చారు. మొన్నటికి మొన్న పోలింగ్ జరుగుతుండగా.. గెలుపు అవకాశాలున్నచోట అభ్యర్థులకు ఆర్థిక సాయం చేయలేక వెనుకబడిపోయామని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కౌంటింగ్ వేళ ఏకంగా తమది చిన్నపార్టీ అని చెప్పుకోవడం కూడా ఓకింత అనుమానం వ్యక్తమవుతోంది. ముందే ఓటమి అంగీకరించారా? లేకుంటే వ్యూహమా అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది.