Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వస్తున్నాయి. హంగు ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జేడీఎస్ మరోమారు కింగ్ మేకర్ కాబోతుందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలపై అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుందని సమాచారం.
బుక్ అవుతున్న స్టార్ హోటల్ గదులు..
హైదరాబాదులో కర్ణాటక రాజకీయం మొదలైంది. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో హంగ్ సర్కార్ ఏర్పాటుకు ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించాయి. 30 ఏళ్ల అధికార మార్పు సంప్రదాయాన్ని మారుస్తామని బీజేపీ బీరాలు పలికినా.. ఫలితాలు అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. కర్ణాటకలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఓటర్లు కొనసాగించారు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. అయితే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 113 వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. ఇందుకు రెండు పార్టీలు హైదరాబాద్ ను వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కొందరు కన్నడ నేతలు రెండు పార్టీల తరఫున స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేస్తున్నారు.
నగరానికి కింగ్ మేకర్లు..
కర్ణాటకలో ఏర్పడే ప్రభుత్వంలో కింగ్ మేకర్ పాత్ర పోషించే ఎమ్మెల్యేలను హైదరాబాద్ లోని హోటళ్లకు తరలించెలా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన, తమ ఆఫర్ నచ్చి తమ వెంట వచ్చే ఎమ్మెల్యేలను క్యాంప్ కు తరలించే పనిని కొంత మంది సీనియర్లకు అప్పగించినట్లు సమాచారం. ఈమేరకు గెలిచిన ఎమ్మెల్యేలను తరలించేందుకు తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్ 20, నోవాటెల్ హోటల్ లో 20 రూమ్ లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.