UPA : ప్రతిపక్ష పార్టీలు కలిసి ఐక్య వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి ఒక్కరోజు కూడా గడవకముందే అందులో లుకలుకలు బయటకు వచ్చాయి. నేతల మధ్య మనస్పర్థలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కూటమి కూకటి వేళ్లతో మోదీని ఎలా పడగొడుతుంది? కేంద్రంలోకి ఎలా అధికారంలోకి వస్తుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి విపక్షాలు ఎప్పటి నుంచో కూటమిగా ఏర్పడాలనుకుంటున్నాయి. నితీష్ ఆధ్వర్యంలో పలు మార్లు సమావేశమైనప్పటికీ అంత బలంగా అడుగులు పడలేదు. దీంతో ఐక్యతారాగం కష్టమే అనే వ్యాఖ్యలు వినిపించాయి. అనేక శషభిషల తర్వాత ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ దీనికి సారథ్యం వహించారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నుంచి మమతాబెనర్జీ వరకు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీట్ల పంపకం మినహా మిగతా అన్ని విషయాలో ఏకాభిప్రాయం సాధ్యమైందని ప్రతిపక్ష పార్టీలు వెల్లడించాయి. దీంతో మోదీ వ్యతిరేక స్వరం బలం పెంచుకుందని, వచ్చే ఎన్నికల్లో పోటాపోటీ ఖాయమనే సంకేతాలు కన్పించాయి. కానీ ఆదిలోనే హంసపాదులాగా నేతల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. అది కూడా సమావేశం నిర్వహించి రోజు కూడా గడవకముందే.
ఆప్ వల్ల కుదుపు
ఢిల్లీలో ప్రభుత్వ హక్కులకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇది కార్యరూపం దాల్చితే అధికారం పార్టీ కేవలం ‘ఆటబొమ్మ’ లాగా మారిపోతోంది. అధికారాలు మొత్తం కేంద్రప్రభుత్వానికి దఖలు పడతాయి. ఈ పరిణామం సహజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించడం లేదు. దీనిపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుతున్నారు. అలా రాని పక్షంలో తాము కూటమిలో ఉండలేమని తెగేసి చెబుతున్నారు. పార్లమెంట్‌లో దీనిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖార్గే స్పందించారు. ‘ప్రభుత్వంతో ఏకీభవించడం, విభేదించడం పార్లమెంట్ బయట జరగవు. ఆప్ దీనిని ఎందుకింత వివాదం చేస్తోందో అర్థం కావడం లేదు.’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ఆర్డినెన్స్ విషయంలో ఢిల్లీ ప్రజల పక్షాన నిలుస్తారో?, లేదో? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తేల్చుకోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు.
సీపీఎంతోనే ఫైట్
ఇక ఐక్య వేదికలో తాము ఉండలేమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా చెబుతున్నారు. కూటమిలో సీపీఎం ఉంటే తాము ఎలా అడుగులు వేస్తామని ఆమె ప్రశ్నిస్తున్నారు. కూటమి సమావేశం రోజున నితీష్ కుమార్‌కు ఆప్యాయంగా బొట్టు పెట్టిన ఆమె ఒక్కరోజు తిరగకముందే మాట మార్చడం ఇక్కడ విశేషం. మరోవైపు కేరళలో కాంగ్రెస్ కూటమి(యూడీఎఫ్)ప్రత్యర్థి అని, బీజేపీని గద్దె దించే విషయంలో తాము సానుకూలంగా ఉన్నప్పటికీ.. రాష్ట్రం విషయంలో కాంగ్రెస్‌తో దూరం పాటిస్తామని సీపీఎం నాయకులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో పొత్తు సాధ్యం కాదని, రాజకీయ అంశాలపై ఉమ్మడి వైఖరి అవలంబించడం కుదరదని వారు వివరిస్తు న్నారు. ఈ పరిణామాలు ఐక్యవేదిక ఏర్పాటుకు విఘాతం కలిగిస్తున్నాయి. ఫలితంగా ఆదిలోనే హంసపాదు సామెతను గుర్తు చేస్తున్నాయి.