Telangana Congress : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే, సహ ఇన్‌చార్జి రోహిత్ చౌధురి పరోక్షంగా ఇందుకు సంకేతాలు ఇచ్చారు. బీజేపీ ముఖ్యనేతలు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలు జరుగుతున్నాయని వారు వివరించారు. ‘కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరిన నేతలు అక్కడ ఇమడలేకపోతున్నారు. తిరిగి పార్టీలో చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. త్వరలో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు తదితరుల చేరికలు ఉంటాయి. ఆ తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతారు. ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని’ మాణిక్ రావు ఠాక్రే, సహ ఇన్‌చార్జి రోహిత్ చౌధురి చెబుతున్నారు.
వివాదాలు సద్దుమణిగాయి
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత తెలంగాణ పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగాయని తెలుస్తోంది. అంతా కలిసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టినట్టు కనిపి స్తోంది. ఈ పరిణామాలను గమనిస్తున్న ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ చేరికలు పెరిగే అవకాశం లేకపోలేదు. వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల తమ పార్టీలో చేరే అంశాన్ని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీలో నెలకొన్ని జోష్ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ముందుగానే ప్రకటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆమె పర్యటనలపై త్వరలోనే ఇక్కడి నేతలు కార్యాచారణ రూపొందించే అవకాశం ఉంది.
కేటీఆర్ భేటీ మతలబేంటి?
‘పట్నాలో విపక్షాలకు చెందిన నేతల సమావేశం జరిగిన రోజే ఢిల్లీలో మంత్రి కేటీఆర్, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. దీనిలో ఆంతర్యమేమిటి? కేంద్రం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై విపక్ష పార్టీలు సమావేశమవుతున్న తరుణంలో బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే.. ఈ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉంది. పొత్తును ఖరారు చేసుకోడానికే అమిత్ షాను కలుస్తున్నారని’ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
శివకుమార్‌ను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
ఇక ఈ పరిణామలు జరుగుతుండగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెంగళూరులో కలిశారు. ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని, దీనికి సంబంధించి సంప్రదింపులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో డీకేతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండున ఖమ్మానికి రాహుల్ గాంధీ
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే నెల 2న ఖమ్మం వచ్చే అవకాశం ఉంది. పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు వారి అనుచరగణం రాహుల్ సమ క్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఒకవేళ రాహుల్ పర్యటన ఆ రోజు వీలుకాకపోతే మరుసటి రోజున (జూలై 3న) సభ నిర్వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
26న ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి
కాగా, సభ నిర్వహించడానికి ముందే.. ఈ నెల 26న పొంగులేటి, జూపల్లితోపాటు వారి అనుచరులు ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిక విషయమై చర్చించడంతోపాటు ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభల నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. పొంగులేటి బృందం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరీకరణ జరుగుతుందని, ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు ఈ జిల్లా నుంచే వస్తాయని ఆశిస్తున్న నేపథ్యంలో రాహుల్ సభను విజయంతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తోంది.