Ayodhya Temple: అయోధ్య రామ మందిరం.. దేశంలో ఇప్పుడు ఏ నోట విన్న అదే మాట. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రామ జన్మభూమిలో ఈ అద్భుత కట్టడం రూపుదిద్దుకుంది. హిందువులు దైవ స్వరూపంగా కొలిచే శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఈ మందిర నిర్మాణం చేపట్టడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆలయ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతుండడంతో యావత్ భారతదేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మికత ఫరిడవిల్లుతోంది.ఎన్నెన్నో అద్భుతాలకు, చరిత్ర ఆనవాళ్లకు అయోధ్య రామ మందిరం నిలువెత్తు సాక్ష్యం కానుంది.
ఒకవైపు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట, విగ్రహాల ప్రాణప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆలయంలో ప్రతిష్టించే రామయ్య విగ్రహానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ వివరాలను వెల్లడించారు. 51 ఇంచుల పొడవు, 1.5 టన్నుల బరువు కూడిన బలరాముడు సుందర రూపం భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. గర్భాలయ నిర్మాణం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రీరామ నవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు రామయ్య విగ్రహం పై పడతాయని తెలిపారు.
గర్భాలయంలోని రామయ్య విగ్రహ ఎత్తు విషయంలో అంతరిక్ష పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తల సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం తెలుగు నెలల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షంలో తొమ్మిదో రోజు శ్రీరామనవమి వస్తుంది. ఆరోజు కిరణ స్పర్శ ఉండే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రామయ్య దేదీప్యమానంగా వెలిగిపోనున్నారు. చారిత్రాత్మక స్థలంలో ఆలయ నిర్మాణం చేపడుతున్నందున.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దేశంలో ప్రాచుర్యం పొందిన కళాకారులు విగ్రహాల తయారీలో పాలుపంచుకున్నారు. నల్లటి రాతితో రూపొందించిన రాములోరి విగ్రహం చూసేందుకు రెండు కళ్ళు చాలవని తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వివరించారు.