Indian Employees : అప్డేట్ కానిది ఏదైనా అంతటితో ఆగిపోతుంది. సాఫ్ట్ వేర్ అయినా.. మనిషి అయినా అంతే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగుతుంటేనే మనుగడలో ఉంటారు. భారతీయ ఉద్యోగులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. 90 శాతం మంది ఉద్యోగులు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి, కొత్త రంగంలోకి మారాలని కోరుకుంటున్నారట. సరికొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈ మేరకు ప్రముఖ సర్వే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ సర్వే చేపట్టింది. ఆగస్టు 17 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించిన ఈ సర్వేలో.. మొత్తం వెయ్యి మంది ఉద్యోగులు పాల్గొన్నారు. భారతీయులు ఉద్యోగం మారాలని కోరుకోవడానికి, కొత్త రంగాలను ఎంచుకోవాలని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటనప్పుడు.. దాదాపుగా అందరూ చెప్పిన సమాధానం కరోనా. ఈ మహమ్మారి వల్ల వేతనాల్లో కోత పడిందని ఉద్యోగులు భావిస్తున్నారు. అందువల్ల సామర్థ్యం, నైపుణ్యత పెంచుకోవడం ద్వారా వేతనాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. ఇంకా.. ఈ అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలు ఏమంటే..
మెజారిటీ ఉద్యోగులు.. తమకు ఇప్పుడున్న స్కిల్ సరిపోదని భావిస్తున్నారట. రాబోయే ఐదేళ్లలో తమ నైపుణ్యానికి కాలం చెల్లుతుందని ఏకంగా 75 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వే తెలిపింది. వీరిలో 90 శాతం మంది కొత్త స్కిల్ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల ఉద్యోగ భద్రత పెరుగుతుందని భావిస్తున్నారు.
47 శాతం మంది సురక్షితమైన పని వాతావరణం ఉండాలని కోరుకుంటుండగా.. 49 శాతం మంది మరింత ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నారని సర్వే రిపోర్టు తెలిపింది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే.. సాంకేతిక, డిజిటల్‌నైపుణ్యాలు ఉండాలని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. 38 శాతం మంది మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరమని చెప్పారు.
మొత్తంగా.. కరోనా తెచ్చిన పరిస్థితుల కారణంగా.. మనుషుల జీవన విధానం మారడంతోపాటు ఆలోచనల్లోనే భారీ మార్పులు వచ్చేశాయి. భవిష్యత్ భద్రత గురించి మరింత జాగ్రత్తగా ఆలోచించడం, అడుగులు వేయడం చేస్తున్నారు. ఈ కారణంగానే.. అందరూ అప్డేట్ అవుతామంటున్నారు.