Shirdi Saibaba Temple: సమస్త సద్గురుడు సాయినాథుడు. దేశంలో అంత్యత ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో షిరిడీ ఒకటి. ఏటా లక్షల మంది భక్తులు సాయినాథుడిని సందర్శిస్తారు. ఏటేటా సాయిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో సెక్యూరిటీ సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సాయి సంస్థాన్ ట్రస్టు పెద్దలు, మహారాష్ట్ర పోలీసులు సీఐఎస్‌ఎఫ్ భద్రతకు ప్రతిపాదించారు. దీనిని షిరిడీ వాసులు వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు, ట్రస్టు పెద్దల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీతో భద్రత నిర్ణయంపై నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో అసలు షిరిడీలో ఏం జరుగుతుంది అన్న అనుమానాలు భక్తులోల మొదలయ్యాయి.
సీఐఎస్‌ఎఫ్ భద్రతపై స్థానికుల వ్యతిరేకత..
షిరిడీలోని సాయిబాబా ఆలయానికి మరింత భద్రతను కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్టు పెద్దలు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ఆలయానికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని షిరిడీ వాసులు వ్యతిరేకిస్తున్నారు. దానికి నిరసనగా మే 1 నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం ట్రస్టు ఆధ్వర్యంలో భద్రత..
ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతను సాయి సంస్థాన్ సిబ్బంది చూస్తున్నారు. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రతిరోజూ బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో ఆలయ భద్రతపై ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సీఐఎస్‌ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ మద్దతు పలికింది. ఈ నిర్ణయాన్నే షిరిడీ వాసులు వ్యతిరేకించారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు.
సీఐఎస్‌ఎఫ్ భద్రతకే ట్రస్టు మొగ్గు..
స్థానికులు వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర బలగాల భద్రతకే మహారాష్ట్ర పోలీసులు, సాయి సంస్థాన్ సిబ్బంది మొగ్గు చూపుతున్నారు. దీనిపై షిరిడీలో గురువారం అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు సమావేశమయ్యారు. ట్రస్టు నిర్ణయాన్ని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఐఎస్‌ఎఫ్ భద్రతను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన మే 1 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. తర్వాతి కార్యాచరణను అదేరోజు గ్రామ సభ నిర్వహించి తెలియజేస్తామని ప్రకటించారు.
వ్యతిరేకతకు కారనం ఏంటి?
షిరిడీ సాయినాథునికి కల్పించే సీఐఎస్‌ఎఫ్ భద్రతను స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే దీనికి స్థానికులు ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న షిరిడీలో కేంద్ర బలగాలు దిగితే దైవ దశనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, స్థానికులూ ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. తనిఖీల పేరుతో సీఐఎస్‌ఎఫ్ భక్తులను ఇబ్బంది పెడుతుందని చెబుతున్నారు. పూజల విషయంలోనూ ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
భక్తులకు ఇబ్బది కలుగకుండా బంద్..
మే 1 నుంచి షిరిడీలో నిరవధిక బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చిన నేపథ్యంలో సాయి దర్శనంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించమని స్థానికులు తెలిపారు. సాయి దర్శనానికి వచ్చే వారి నిర్భయంగా దర్శించుకోవచ్చని పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బంద్ పూర్తిగా ప్రశాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో సాయి దర్శనానికి నిత్యం వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఈమేరకు క్లారిటీ ఇచ్చారు.
గ్రామస్తుల డిమాండ్లు ఇవీ..
– సాయిబాబా మందిరానికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను రద్దు చేయాలి.
– సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలి. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలి.
– షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలి. ఇందులో 50 శాతం ధర్మకర్తలు షిరిడీ నుంచే ఉండాలి.