KCR- Kumaraswamy: “కుమార్ స్వామి మంచి విలువలు ఉన్న నాయకుడు. వాళ్ల నాన్న ఒకప్పుడు ప్రధానమంత్రిగా పనిచేశాడు. కుమారస్వామి కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అవసరం అనుకుంటే అతడికి మేము మద్దతు ఇస్తాం. అవసరం అనుకుంటే తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో గట్టి ప్రచారం చేస్తాం. పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వం. ప్రాంతీయ పార్టీల శక్తి ఏమిటో నరేంద్ర మోదీకి చూపిస్తాం” అప్పట్లో కుమారస్వామి ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు ఇలా సాగాయి కేసీఆర్ మాటలు. అంతేకాదు కుమారస్వామికి 400 కోట్ల దాకా కెసిఆర్ డబ్బులు సర్దుబాటు చేశారనే విమర్శలు కూడా వినిపించాయి. తర్వాత పలుమార్లు కుమారస్వామి ప్రగతిభవన్ రావడం, కెసిఆర్ తో చర్చలు జరపడం జరిగిపోయాయి. ఒకానొక దశలో కుమారస్వామి పార్టీతో కలిసి కెసిఆర్ కర్ణాటకలో పోటీ చేస్తారని ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కుమారస్వామి ప్రగతి భవన్ వైపు రావడం మానేశాడు. కెసిఆర్ కూడా అంతే. పైగా ఆ మధ్య జాతీయ పార్టీ కార్యాలయం ఢిల్లీలో ప్రారంభిస్తున్నప్పుడు కుమారస్వామి రాలేదు. ఆ ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని కెసిఆర్ ప్రకటించారు. అయితే ఆ మాటలు చేతల్లో కనిపించడం లేదు.
మహారాష్ట్ర పై మోజు
కెసిఆర్ తన అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తాడు. అంతేతప్ప ఎవరితోనూ దీర్ఘకాలం స్నేహం చేయడు. అందుకే కాబోలు కుమారస్వామిని దూరం పెట్టాడు. కనీసం కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు వాళ్ళు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో కనీసం కుమారస్వామి పార్టీ తరఫున ప్రచారం కూడా చేయడం లేదు. ఆమధ్య సత్యవతి రాథోడ్ కర్ణాటక వెళ్లి వచ్చినప్పటికీ కుమారస్వామి పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా లేవని ఆమె కెసిఆర్ తో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో అందుకే కేసిఆర్ దూరంగా ఉన్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో తెలంగాణకు సరిహద్దు ప్రాంతం గా ఉన్న మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేయాలని కెసిఆర్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని మూడు ప్రాంతాల్లో భారీ సమావేశాలు నిర్వహించారు. అక్కడి మరాఠి మీడియాకు కోట్లల్లో ప్రకటనలు ఇచ్చారు..
అందుకేనా పిలిచింది
ఇటీవల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను ఆహ్వానించింది. ఇందులో కూడా కెసిఆర్ తన రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి చెందిన గవర్నర్ ను ఆహ్వానించకుండా, ఎక్కడో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రకాష్ అంబేద్కర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, అది మహారాష్ట్రలో ప్రయోజనం పొందడానికి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు. మహారాష్ట్ర ప్రజలు అతడిని దేవుడిలాగా కొలుస్తారు. ప్రకాష్ అంబేద్కర్ ద్వారా మహారాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలనే ప్రయత్నంలో భాగంగానే కెసిఆర్ ఎత్తుగడలు వేశాడని చర్చ నడుస్తోంది.
ఎందుకంటే
కర్ణాటక తో పోలిస్తే మహారాష్ట్ర చాలా భిన్నం. పైగా ఈ ప్రాంతంతో తెలంగాణ నేతలకు మంచి సంబంధాలు ఉన్నాయి. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు మహారాష్ట్ర నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పైగా మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత్వం ఎక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ మరాఠాలో శంఖారావం పూరించాడు. అక్కడ ఎటువంటి ఎన్నికలు లేకపోయినప్పటికీ.. తన దగ్గర ఉన్న ఆర్థిక సంపత్తితో మహారాష్ట్రలో సంచలనం సృష్టించేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే చోటా మోటా నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. అంతే కాదు ఈ చేరికల సందర్భంగా రకరకాల నజరానాలు ప్రకటిస్తున్నాడు. అయితే కేసీఆర్ లో ఈ కోణం చూసి కుమారస్వామి ముక్కున వేలేసుకుంటున్నాడు. పాపమ్ జేడీఎస్ అధిపతికి కెసిఆర్ అసలు స్వరూపం ఎలా ఉంటుందో ఇప్పటికైనా బోధపడింది.