Karnataka: మాతృభాష అనేది కన్నతల్లి లాంటిది. అందులో ప్రావీణ్యం సంపాదిస్తే ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడొచ్చు. ప్రస్తుతం ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ గా మారిన నేపథ్యంలో ఇంగ్లీష్ అనేది అత్యంత అవసరమైన భాషగా మారిపోయింది. వాడే స్మార్ట్ ఫోన్ నుంచి తినే తిండి వరకు ప్రతి అంశంలో ఇంగ్లీష్ అనేది అత్యంత అనివార్యమైపోయింది. పైగా కొలువులు కూడా ఇంగ్లీష్ భాషతో ముడిపడి ఉండడంతో మన చదువులోకి కూడా ఆంగ్లం అంతర్లీనం అనే స్థాయి నుంచి తప్పనిసరి అనే పరిస్థితికి ఎదిగింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ మీడియం అనేది అత్యంత అవసరమైపోయింది. దీనికి తోడు ప్రభుత్వాలు ఇంగ్లీషుకు అమితమైన ప్రాధాన్యం ఇస్తుండడంతో స్థానికంగా ఉన్న భాషలు క్రమేపి మరుగున పడుతున్నాయి. వాడుక వరకు మాతృభాష కొనసాగుతోంది. కానీ రాతల్లో, చేతల్లో మాత్రం మాతృభాష ఆనవాళ్లు కనిపించడం లేదు.. ఇలాంటి పరిస్థితి రావద్దనే తమిళనాడు రాష్ట్రంలో తమిళ భాషను పాఠ్యాంశాల్లో కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇంటర్ వరకు కచ్చితంగా తమిళం చదవాలని.. తమిళంలో మెరుగైన మార్కులు సాధించాలని నిబంధన కూడా పెట్టారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ నిబంధన సరిగ్గా అమలు కావడం లేదు. మాతృభాషకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను మిగతా ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. అందువల్లే నిరసనలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.
కర్ణాటక రాష్ట్రంలో సాధారణంగా ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని దేశ ఐటీ రాజధానిగా పిలుస్తారు. బహుళ జాతి కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వారి అవసరాలు తీర్చేందుకు రకరకాల వ్యాపార సముదాయాలు కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన వివిధ సంస్థలకు సంబంధించిన బోర్డులన్నీ ఇంగ్లీషులో ఉండడంతో అక్కడి కన్నడ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. మా ప్రాంతంలో కార్యకలాపాలు సాగించుకుంటూ.. మా భాషలో కాకుండా ఇంగ్లీషులో బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని అక్కడి కన్నడ భాష అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అదే ఈ విధానానికి చరమగీతం పాడాలని కొంతకాలంగా వారు వివిధ రకాల సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వినతులు కూడా చేశారు. అప్పటికి ఉపయోగం లేకపోవడంతో వారు తమ విశ్వరూపాన్ని చూపారు.
కర్ణాటక రాష్ట్రంలో అధికార భాష కన్నడ బోర్డులు లేకుండానే వ్యాపారాలు చేయడంపై కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించింది. అంతేకాకుండా విమానాశ్రయం సమీపాన ఉండే సాధహళ్లి టోల్ గేట్ నుంచి కన్నడ రక్షణ వేదిక నేతలు ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల ఆంగ్లంలో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. అయితే కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తీవ్ర నిరసనకు సిద్ధమవుతుండగా కార్బన్ పార్క్ పోలీసులు అధువులకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాషను హీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలు కన్నడ భాషను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. నిబంధనల ప్రకారం 60 శాతం సైన్ బోర్డులు కన్నడలోనే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి భాష, నేల, నీరు విషయంలో కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే కర్ణాటక రక్షణ వేదిక నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సాంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ రంగంలోకి దిగారు. జనవరి ప్రారంభంలోనే కన్నడ భాష పరిరక్షణ సభ జరుపుతామని.. 60% బోర్డులు కన్నడలో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహజంగా కర్ణాటక రక్షణ వేదిక చేసిన నిరసన కొంతమందికి కంటగింపుగా ఉన్నప్పటికీ.. మెజారిటీ ప్రజల్లో ఆలోచనను రేకెత్తించింది. ఎందుకంటే కార్పొరేట్ చదువుల వల్ల స్థానిక భాష క్రమేపి మరుగునపడుతోంది. ఇది అంతిమంగా మాతృభాషను సొంత ప్రజలకు దూరం చేస్తోంది. మరి ఇలాంటి ఉద్యమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తాయో?
బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత
బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల నేమ్ బోర్డులపై ఇంగ్లిష్, హిందీలో పేర్లు ఉండటాన్ని వ్యతిరేకిస్తు కన్నడ సంఘాలు దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. pic.twitter.com/5BrsFn3ktT
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2023