Corona Vaccine: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేర్వేరు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేసి పరిశోధనకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. రెండు వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవడం గురించి సైతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వేర్వేరు కరోనా డోసులు తీసుకోవడం ద్వారా 67 శాతం నుంచి 79 శాతం వరకు కరోనా ముప్పు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా 67 శాతం ముప్పు తగ్గుతుండగా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా 79 శాతం ముప్పు తగ్గుతోందని తెలుస్తోంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలలో సైతం ఇవే విషయాలు వెల్లడి కావడం గమనార్హం.
దాదాపు 7 లక్షల మంది పౌరుల వివరాలను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు. వేర్వేరు కరోనా వ్యాక్సిన్లు కాకుండా ఆస్ట్రాజెనెకా రెండు డోసులు తీసుకుంటే కేవలం 50 శాతం మాత్రమే కరోనా ముప్పు తగ్గుతుండటం గమనార్హం. వేర్వేరు కరోనా వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడం కూడా సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
మిక్సింగ్ పద్ధతిలో వ్యాక్సిన్ వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్న నేపథ్యంలో వేర్వేరు కరోనా వ్యాక్సిన్లను తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారమే కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. సొంతంగా రెండు వేర్వేరు డోసులను తీసుకోవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.