Ayodhya Temple: వందల సంవత్సరాల కల నెరవేరుతోంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి తన సొంత భూమిలో నిర్మించిన మందిరంలో కొలువు తీరబోతున్నాడు. అయితే ఈ మహత్కార్యాన్ని పురస్కరించుకొని దేశం యావత్తు జనవరి 22న పండగ చేసుకోనుంది. నవంబర్లో జరుపుకున్నట్టుగానే ఆరోజు కూడా దీపావళి జరుపుకోనుంది. ఇప్పటికే రామ మందిరానికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాముడి ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ అయోధ్య రాముడి గుడి నిర్మాణంలో హైదరాబాద్ తన వంతు పాత్ర పోషిస్తున్నది. రామ మందిరానికి సంబంధించి వాడిన బంగారు పాదుకలు, దర్వాజలు, తలుపులు హైదరాబాదులోని బర్కత్పురా అనురాధ టింబర్ డిపో నుంచి వెళ్లాయి. ఇవే కాక ఇతర నిర్మాణ సామాగ్రి కూడా హైదరాబాదు నుంచే వెళ్ళింది. అయితే ఇప్పుడు అయోధ్యలో తెలంగాణ రుచి కూడా అక్కడి ప్రజలకు దక్కనుంది.
అయోధ్యలో రాముడి ప్రతిష్టాపనను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తెలంగాణ రుచులను శ్రీరామ ప్రసాదం పేరుతో అందించనున్నారు. అది కూడా ఏకంగా 40 రోజులపాటు ఈ శ్రీరామ ప్రసాద యజ్ఞం కొనసాగించనున్నారు. తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన పచ్చి పులుసు, బగహార అన్నం, తెల్లన్నం, కిచిడి, ఆలూ కూర్మ, టమాటా ఆలుగడ్డ కూర, పప్పు, వంకాయ మసాలా, పులిహోర, పెరుగన్నం వంటి వంటకాలను భక్తులకు వడ్డించనున్నారు. ఇక తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన రవ్వ కేసరి, దూద్ పేడ, బేసిన్ లడ్డు వంటి స్వీట్లు కూడా అందిస్తారు. ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు రోజుకు 6000 మందికి ఇలా శ్రీరామ ప్రసాదాన్ని వడ్డిస్తారు.
ఇక ఈ ప్రసాదం తయారీకి కావలసిన నిత్యవసరాలను మంగళవారం అయోధ్యకు ప్రత్యేక లారీల్లో పంపించారు. ఇందుకుగాను రెండు బృందాలు అయోధ్యకు వెళ్లాయి. అయోధ్య శ్రీ రామ తీర్థ ట్రస్ట్ ఈ అవకాశం వారికి ఇచ్చింది. 25 టన్నుల బియ్యం, 12 టన్నుల నిత్యావసరాలతో కూడిన లారీలు బషీర్ బాగ్ లోని శ్రీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం బయలుదేరి వెళ్లిపోయాయి. ఈ వాహనాలు 12న అయోధ్యకు చేరుకుంటాయి. వంటల తయారీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి చెందిన 35 మంది నలభీములు, 160 మంది విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అయోధ్యకు వెళ్లారు. ఇక ఈ తెలంగాణ ప్రత్యేక వంటకాలు మొత్తం అయోధ్యలోని మందిరం ఆరోగ్య సమీపంలో భక్తుల కోసం అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ వంటకాల తయారీకి సంబంధించి బర్కత్పురా నుంచి వంట చెరుకు కూడా తరలి వెళ్ళిపోయింది. సాధ్యమైనంత వరకు ఆవు పిడకలతో ఈ వంటలు తయారు చేస్తామని, అనివార్య పరిస్థితుల్లోనే వంట చెరుకు వాడతామని, గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించబోమని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు చెప్పారు.