
దేశంలో రోజురోజుకు క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతున్న సంగతి తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా చాలామంది బ్యాంకులు ఆఫర్ చేస్తూ ఉండటంతో క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా క్రెడిట్ కార్డ్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ యూజర్లకు వడ్డీపై వడ్డీ మాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు చెబుతోంది.
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలో ప్రజల ఆదాయం తగ్గడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఉద్యోగుల వేతనాలు తగ్గగా వ్యాపారులకు లాభాలు గణనీయంగా తగ్గాయి. ఉద్యోగాలు, వ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు లాభాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదట మార్చి నెల నుంచి మే నెల వరకు లోన్ మారటోరియం ప్రకటించింది.
అయితే మే నెల చివరినాటికి కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. మరోవైపు లాక్ డౌన్ అమలు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ లోన్ మారటోరియంను పొడిగించింది. క్రెడిట్ కార్డులతో పాటు లోన్లు పొందేవాళ్లకు కూడా బ్యాంకులు లోన్ మారటోరియం ప్రయోజనాన్ని కల్పించాయి. అయితే బ్యాంకులు మారటోరియం సమయంలో వడ్డీ మీద వడ్డీ వసూలు చేసిన నేపథ్యంలో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దాఖలైన పిటిషన్ల గురించి సుప్రీం కోర్టులో చర్చలు జరగగా సుప్రీం కోర్టు క్రెడిట్ కార్డు యూజర్లకు చక్రవడ్డీ ప్రయోజనం అందించాల్సిన అవసరం లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. క్రెడిట్ కార్డు యూజర్లు లోన్ పొందలేదని వీళ్లు రుణగ్రహీతల కిందకు రారని తెలిపింది. సుప్రీం వ్యాఖ్యలు క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్ అనే చెప్పాలి.