HomeజాతీయంArun Goel: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అరుణ్ గోయల్ సడన్ గా ఎందుకు తప్పుకున్నాడు?...

Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అరుణ్ గోయల్ సడన్ గా ఎందుకు తప్పుకున్నాడు? ఆ కథ ఏంటి?

Arun Goel: పార్లమెంటు ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గోయల్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. గోయల్‌ పదవీకాలం 2027 వరకు ఉంది. అయినా ఇంత ముందుగా రాజీనామా చేయడానికి కారణాలు తెలియడం లేదు.

ఒకే ఒక్కడు..
కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తోపాటు మరో ఇద్దరు కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఒక కమిషనర్‌ అనూప్‌చంద్రపాండే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం భర్తీకి కసరత్తు జరుగుతుండగా తాజాగా మరో కమిషనర్‌ అరుణ్‌గోయల్‌ రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మాత్రమే మిగిలారు.

లోక్‌సభ షెడ్యూల్‌పై ప్రభావం?
తాజాగా ఎన్నికల సంఘంలో జరిగిన పరిణామాలతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై ప్రభావం పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 12 లేదా 13న షెడ్యూల్‌ వస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీనామాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

భర్తీ ప్రక్రియ ఇలా..
సీఈవో ఓఈసీ యాక్ట్‌ 2023 ప్రకారం న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ(ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు) ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను ప్రధాని నేతృత్వంలోని కమిటీకి(ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర ఎంపిక కమిటీ) అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాళీ భర్తీ చేయడం కోసం ఈ కమిటీ భేటీ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతోంది. ఇప్పుడు రెండు పదవులు ఖాళీ అయిన నేపథ్యంలో సమావేశం త్వరగా జరుగుతుందని తెలుస్తోంది.

గోయల్‌ ఎన్నికపై వివాదం..
అరుణ్‌గోయల్‌ పంజాబ్‌ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌. 2022 నవంబర్‌ 18న ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాతిరోజే ఆయనను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా కేంద్రం నియమించింది. ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ ఫోరమ్స్‌ అరుణ్‌ గోయల్‌ నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ నియామకంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేం నియామకం అని ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ల నియామాకానికి అనుసరించే పద్ధతి అడిగి తెలుసుకుంది. ఇంకా అనేక సందేహాలను వ్యక్తం చేసింది. ఆ సమయంలో మౌనంగా ఉన్న గోయల్‌.. ఎన్నికల వేళ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular