Ram Mandir: అయోధ్యలో మరికొన్ని గంటల్లో ఓ మహాఘట్టానికి తెరలేవనుంది. అయోధ్య మహానగరం నడిబొడ్డున శ్రీరామచంద్రులు కొలువుదీరనున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం (జనవరి 22) మధ్యాహ్నం 12:15 నిమిషాల నుంచి 12:45 నిమిషాల మధ్య జరుగనుంది.
మేషలగ్నం, అభిజిత్ ముహూర్తం..
బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం మేష లగ్నం, అభిజిత్ ముహూర్తంలో నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్‌లల్లాకు ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే ప్రాణ ప్రతిష్టకు ముందు నిర్వహించే ప్రత్యేక పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ట అంటే స్థాపన. శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా చెప్పవచ్చు.

అయోధ్యకు ఆధ్యాత్మిక శోభ
శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా, ఎక్కడ చూసినా రాముడు, సీత, హనుమంతుడు, రామాయణ దృశ్య కావ్యాలే దర్శనమిస్తున్నాయి. వీధులన్నీ కాషాయమయమయ్యాయి. రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మార్మోగుతోంది.
7 వేల మందికి ఆహ్వానం..
ఇక ఈ మహాఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం కేవలం ఏడు వేల మందికే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కల్పించింది. ఈమేరకు ఆహ్వాన పత్రాలు పంపించింది. ఆహ్వానాలు అందుకున్నవారంతా అయోధ్యకు చేరుకుంటున్నారు. వీవీఐపీలు, వీఐపీలు సోమవారం ఉదయం అయోధ్యకు చేరుకోనున్నారు.
500 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న కలను చూసేందుకు, అయోధ్యలో అడుగుబెట్టబోతున్న సీతారాములను ఆహ్వానించేందుకు యావత్ దేశం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది.