Ram Mandir: దేశంలో ఎక్కడ చూసినా రామనామమే. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాల రాముడు ప్రాణ ప్రతిష్ట వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు మధ్యాహ్నం 12:20 నుంచి 12:45 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఇంట్లో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు.
ప్రత్యేక పూజలు చేయడం ద్వారా రాముని అనుగ్రహం పొందవచ్చు. తెల్లవారుజామున శుద్ధి స్నానం చేయాలి. నుదిటిపై సువాసన గల చందన తిలకం పెట్టుకోవాలి. లేత రంగు వస్త్రాలను ధరించాలి. పాలు, తేనె, ఇతర పవిత్రమైన నైవేద్యాలను ఉపయోగించి శ్రీరాముని విగ్రహానికి అభిషేకం, ఉత్సవ స్నానం చేయాలి. పూజ చేసే పీఠం కింద, మందిరం వద్ద ముగ్గును వేసి అలంకరించాలి. స్వస్తిక లేదా ఓ చిహ్నాన్ని వేయాలి. సమర్పణల కోసం శక్తివంతమైన బలి పీఠాన్ని సృష్టించాలి. టేబుల్ పై శుభ్రమైన ఎర్రటి గుడ్డను పరచాలి. దాని మధ్యలో సమృద్ధి, శ్రేయస్సుకు ప్రతీకగా భావించే బియ్యాన్ని పోగుగా వేయాలి. పసుపు,కుంకుమ, పువ్వులతో కలశాన్ని అలంకరించాలి. దానిలో కొబ్బరికాయ ఉంచి కిరీటం ఏర్పాటు చేసి తాజా పండ్లను చుట్టు పెట్టాలి. బాల రాముడి విగ్రహాన్ని మీకు అభిముఖంగా ఉంచుకోండి. దానిపై పువ్వులతో అర్చన చేయండి. ఓం రామ్ రామాయ నమః అనే రామ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే రాముడి అనుగ్రహం పొందవచ్చు అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
కాగా ప్రాణ ప్రతిష్ట వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే బాలరాముడు విగ్రహం గర్భగుడికి చేర్చిన సంగతి తెలిసిందే. విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచారు. మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాపన ఉంటుంది.