Ayodhya Ram Mandir: వందల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రామ మందిర నిర్మాణ కల సాకారం అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే రామ మందిరం, రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట.. క్రతువును చూసేందుకు యావత్ దేశం, ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయ హిందువులు మొత్తం ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ క్రమంలో చాలామందిలో అనేక రకాలైన ఆసక్తులు నెలకొన్నాయి. గూగుల్ అందించిన సమాచారం ప్రకారం చాలామంది రామ మందిర నిర్మాణం గురించి.. దాని వెనుక ఎవరు ఉన్నారు.. ఎంత విస్తీర్ణంలో రామ మందిరాన్ని నిర్మించారు.. అనే అంశాలను తెగ వెతికినట్టు తెలుస్తోంది.. ఇంతకీ ఆ రామ మందిరం విశేషాలు ఏమిటో మనమూ ఒకసారి తెలుసుకుందాం…
అయోధ్యలోని రామ మందిరం భారతదేశంలోనే అతిపెద్ద ఆలయం. దీనిని సోంపురా అనే కుటుంబం నిర్మించింది. 161 అడుగులు, 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయోధ్య విస్తరించి ఉంది. ఈ ఆలయ నిర్మాణం చాళుక్యుల శైలి, వాస్తు శాస్త్రం, శిల్పశాస్త్రాలకు లోబడి ఉంది. ఈ ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ శ్రీ రాముడి జన్మ, బాల్యాన్ని వివరిస్తుంది. మొదటి అంతస్తు రాముడి దర్బార్ ను పోలి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ రాష్ట్రంలో భరత్ పూర్ ప్రాంతంలో లభ్యమయ్యే గులాబీ రంగు ఇసుకరాయి ని ఉపయోగించారు. దీనిని అక్కడ స్థానికులు బన్సి పహార్ పూర్ అని పిలుస్తారు. అయోధ్య ఆలయం 132.7 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో ఉంది. ఇక ఈ ఆలయాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కొక్కటి 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ 160 నిలువు వరుసలు కలిగి ఉంది. మొదటి, రెండు అంతస్తులు వరుసగా 132, 74 నిలువు వరుసలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయంలో 12 ద్వారాలు నిర్మించారు.
ఆలయ నిర్మాణంలో ముఖ్య వాస్తు శిల్పిగా చంద్రకాంత్ సోంపురా వ్యవహరించారు. ఆయనకు అతని కుమారులు ఆశిష్, నిఖిల్ సహకరించారు. సోంపురా కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా 100 దేవాలయాలు రూపొందించింది. అయోధ్యలో పని పూర్తికాగానే సోంపురా కుటుంబం సోమనాథ్ ఆలయంలో పనులు ప్రారంభిస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కళాకారుడు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సత్యనారాయణ పాండ్యా రాముడి విగ్రహాలను చెక్కారు. రాముడి గర్భగుడిలో మహారాష్ట్రలోని గచ్చిబౌలిలోని అల్లపల్లి అడవుల్లో లభించే టేకు కలపను విస్తృతంగా ఉపయోగించారు. ఇక ఈ ఆలయాన్ని ఉక్కు లేదా ఇనుము ఉపయోగించకుండా పూర్తిగా రాళ్లతో నిర్మించారు. అంతేకాదు ఆలయ నిర్మాణంలో ఎక్కడ కూడా రసాయన పదార్థాలు వినియోగించలేదు. ఒకరకంగా ఈ ఆలయ నిర్మాణం నాటి రాముడి అయోధ్యను పోలి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం నాటి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారత్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన హిందువులు మొత్తం ఈ ఆలయంలో సోమవారం జరిగే రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.