Ayodhya Ram Mandir: వందల ఏళ్ల తర్వాత.. అనేక కోర్టు కేసుల తర్వాత.. తాను జన్మించిన ప్రాంతంలో రాముడికి ఆలయ నిర్మాణం జరుగుతుంది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సాకారం కాబోతోంది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఈ కథకు జరగనుంది. ఈ ఆలయ నిర్మాణం తర్వాత.. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్య నగరం రూపురేఖలు సమూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. స్థూలంగా చెప్పాలంటే ఈ రాముడి ఆలయం కేంద్రంగా వేలకోట్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడే సూచనలు ఉన్నాయి. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో పలుమార్లు విస్తృతంగా పర్యటించారు. ఇటీవల రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. నూతనంగా విమానాశ్రయం కూడా నిర్మించారు. వీటి ప్రారంభం రోజునే ప్రధాని సుమారు 15 వేల కోట్ల రూపాయల విలువైన వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ పనుల ద్వారా ఇక్కడ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు పెరిగే అవకాశం ఉంది. వీటివల్ల అయోధ్యనగరంలో పర్యాటకాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. విస్తృతమైన భూభాగం కలిగి ఉన్న నేపథ్యంలో అయోధ్య నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ అయోధ్య అభివృద్ధి చుట్టుపక్కల ఉన్న 12 జిల్లాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే అయోధ్య నగరానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ 2031 రూపొందించారు. వచ్చే పది సంవత్సరాలలో అయోధ్య నగరంలో దాదాపు 85 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంతేకాదు 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్డ్ సిటీ ప్రాంతం 133 చదరపు కిలోమీటర్లు, కోర్ సిటీ 31.5 చదరపు కిలోమీటర్లతో సహా ఇతర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని అయోధ్య దేవాలయ వర్గాలు భావిస్తున్నాయి. వీటివల్ల అయోధ్య నగరం 21 శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది. తాజా అంచనాల ప్రకారం రామ మందిరం పూర్తయిన తర్వాత నగరంలో నివాసితులు, పర్యాటకుల నిష్పత్తి దాదాపు 1:10 గా ఉండనుంది. అంతేకాదు గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ లో స్టేట్ గెస్ట్ హౌస్ లు, అన్ని రకాల సందర్శకుల అవసరాలు తీర్చేందుకు హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు నిర్మితం కాబోతున్నాయి.
అయోధ్య నగర అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే 31,662 కోట్ల బడ్జెట్ రూపొందించారు. ఈ నిధులతో అయోధ్య నగరాన్ని సమూలంగా మార్చడానికి 37 రాష్ట్ర, జాతీయ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పదివేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రజా పనుల విభాగం 7,500 కోట్ల రూపాయల విలువైన 34 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఈ అభివృద్ధిలో భాగంగా విమానాశ్రయం, రైల్వే లైన్ లు, జాతీయ రహదారులను నిర్మించింది. జనవరి 22కు ముందు ఫాస్ట్ మూవీ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్లు అయోధ్య కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయి. తాజ్, రాడిసన్, ఐ టి సి హోటల్స్, ఓయో వంటి కంపెనీలు కొత్త కొత్త హోటల్స్ తెరిచేందుకు క్యూలో ఉన్నాయి. ఆతిథ్య రంగంలో వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీలు ప్రణాళికలు రూపొందించాయి. అయోధ్య నగరానికి దగ్గర్లోనే ఇవి భారీగా హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నాయి.