HomeజాతీయంHappy Holi: హోలీ శుభాకాంక్షలు ఇలా కూడా చెప్తారా.. ఆనంద్ మహీంద్రా చేసిన పనికి నెటిజన్ల...

Happy Holi: హోలీ శుభాకాంక్షలు ఇలా కూడా చెప్తారా.. ఆనంద్ మహీంద్రా చేసిన పనికి నెటిజన్ల ఫిదా

Happy Holi: ఇవాళ హోలీ.. దేశం మొత్తం రంగులమయం అయిపోయింది. చిన్నాచితకా నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు రంగులు చల్లుకొని ఆడి పాడారు. ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కొన్నిచోట్ల తమ సంప్రదాయాల ప్రకారం ఉట్లు కొట్టారు. కొన్ని ఆలయాలలో రాధాకృష్ణుల కళ్యాణాలు జరిపించారు. సామూహికంగా అన్నదానాలు నిర్వహించారు. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే హోలీ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. శుభాకాంక్షలు చెప్పడంలో ఒక్కొక్కరు ఒక్కో తీరును అనుసరించారు. అయితే అందులో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్విట్టర్ ఎక్స్ వేదికగా వినూత్నంగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ట్విట్టర్ ఎక్స్ లో 11 మిలియన్ల మంది ఫాలోవర్లను ఆనంద్ కలిగి ఉన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. ఆనందాన్ని కలిగించేవి, ప్రేరణగా నిలిచేవి, స్ఫూర్తి పొందినవి, మార్గదర్శకులవి.. ఇలా ఎన్నో విభిన్నమైన వీడియోలను ఆనంద్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు నెటిజన్లను పలు ప్రశ్నలు అడుగుతుంటారు. వారు చెప్పే వివరాల ద్వారా ఆయన సమాధానాలు రాబడుతుంటారు. వేలకోట్లకు అధిపతి అయినప్పటికీ ఆనంద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. ఆయన పోస్ట్ చేసే విషయాలను చాలామంది ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఆయన వ్యూహ చతురతకు అబ్బుర పడుతుంటారు.

ఇక సోమవారం హోలీ సందర్భంగా ఆనంద్ మహీంద్రా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఎక్స్ ఐడిలో ఓ మైదానంలో పురి విప్పి ఆడుతున్న నెమలి వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నెమలి ఫించాలు ఒక్కొక్కటిగా విచ్చుకున్నాయి. సప్తవర్ణాల సమ్మేళితంగా ఆ ఫించాలు దర్శనమిచ్చాయి. చూసేందుకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపించింది. అలా నెమలి నాట్యమాడుతున్న వీడియోను పోస్ట్ చేసి.. అందరికీ హోలీ శుభాకాంక్షలు అంటూ ఆనంద్ రాసుకు వచ్చారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.

” ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పండగపూట కూడా ఆయన తన వ్యూహ చతురతను బయటపెట్టుకున్నారు. కృత్రిమ రంగుల జోలికి పోకుండా.. సహజమైన రంగులతోనే హోలీ జరుపుకోవాలనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. నెమలి ఆడుతున్న వీడియోను పెట్టడానికి కారణం అదే. ఆయన పరోక్షంగా ప్రకృతిపై ప్రేమను కనబరిచారు. ప్రకృతికి అనుగుణంగానే పండుగలు జరుపుకోవాలనే ప్రాథమిక సూత్రాన్ని అలవడేలా చేశారు. ఎంతైనా ఆనంద్ గ్రేట్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular