
Cockpit : విమానాలు నడిపే పైలెట్లకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. అది కొద్ది మంది మాత్రం అప్పుడప్పుడు ఆ నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తుంటారు. ఇటువంటి సమయాల్లో విమానాల్లో ప్రయాణాలు సాగించే ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టినట్లే భావించాల్సి ఉంటుంది. అటువంటి ఘటనే దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఓ విమానంలో చోటుచేసుకుంది. పైలెట్ నిబంధనలను అతిక్రమించి తన గర్ల్ ఫ్రెండ్ ని కాక్ పిట్ లో తన పక్కనే కూర్చోబెట్టుకుని విమానం నడిపాడు. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎయిరిండియా విమాన పైలెట్ ఒకరు బహుశా తాను నడుపుతున్న విమానాన్ని తన కారులా భావించి జల్సా చేద్దామని అనుకున్నాడు. నిబంధనలకు పాతరేసి తన గర్ల్ ఫ్రెండ్ ని కాక్ పిట్ లో తన పక్కనే కూర్చోబెట్టుకుని విమానం నడిపాడు. ఆకాశంలో విహరిస్తూ తన ప్రేయసికి స్వర్గాన్ని చూపించాలి అనుకున్నాడు. అందుకు ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. గత ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానంలో ఈ అనూహ్య సంఘటన జరిగింది. ప్రయాణికురాలిలా విమానం ఎక్కిన ఆ అమ్మడు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా కాక్ పిట్ లో కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ పైలెట్ తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగించి ఎంజాయ్ చేసింది.
మూడు గంటలపాటు ఆకాశయానం చేసిన జంట..
ఈ జంట సుమారు మూడు గంటల పాటు ఇలా ఆకాశయానం చేశారు. అయితే, ఈ పైలెట్ బాగోతం ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ అధికారులకు తెలిసిపోయింది. విమాన ప్రయాణికుల భద్రతను పక్కనపెట్టి నిబంధనలను కాదని అతగాడు ఇలా ప్రవర్తించడాన్ని అధికారులు సీరియస్ గా పరిగణించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి అతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. లైసెన్సును రద్దు చేయడంతోపాటు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఉపక్రమించారు. ఆ మహిళ ఎవరు అన్నది కూడా ఆరా తీసే పనిలో అధికారులు పడ్డారు. అయితే, ఎయిర్ ఇండియా దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఈ తరహా ఘటనలతో చెడ్డ పేరు..
ఎయిర్ ఇండియా విమానాలు తరచూ ఇలాంటి ఘటనలను ఎదుర్కొంటున్నాయి. ఈ నెల 18న పూణే నుంచి ఢిల్లీకి వస్తున్న విమాన విండ్ షీల్డ్ పగుళ్లు రావడంతో అత్యవసరంగా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దింపాల్సి వచ్చింది. మార్చి 12న అమృత్సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ప్లేన్ ఇంజన్లలో ఒకటి గాల్లోనే సరిగా పనిచేయకపోవడంతో విమానాన్ని మధ్యలోనే జైపూర్ విమానాశ్రయంలో దింపారు. తాజాగా పైలట్ లవర్ తో నిర్వహించిన వ్యవహారం బయటకు రావడంతో.. ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విమాన ప్రయాణికుల భద్రతను గాల్లో పెట్టి ఎయిర్ ఇండియా యాజమాన్యం వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా తప్పిదాలకు తావు లేకుండా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.