Adivasi Land Rights: మా తరతరాలు ఇక్కడే ఉంటున్నాయి. మేం కూడా ఇక్కడే ఉంటున్నాం. ఈ గాలి పీల్చుతున్నాం. ఇక్కడ మీరు తాగుతున్నాం. ఇక్కడ పంట పండించుకొని తింటున్నాం. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇక్కడే బతుకుతున్నాం. ఇప్పుడు మా పేగు బంధాన్ని ఎందుకు తెంచుతున్నారు. ఈ మట్టికి మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు” ఇదీ ఆదివాసులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. ఇలా ఆదివాసులు వ్యాఖ్యానించడానికి.. ఆవేదనతో మాట్లాడడానికి కారణం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ జిల్లా మహారాష్ట్రతో సరిహద్దుగా ఉంది.. మహారాష్ట్ర లోని పులులు ఆహార అన్వేషణ కోసం ఇక్కడిదాకా వస్తుంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులులు సంచరిస్తుంటాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు జీవో 49 ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. తద్వారా ఈ మూడు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించింది. దీంతో ఇక్కడి ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇక్కడి నుంచి వెళ్లగొడుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఆదివాసి జాతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల రిజర్వ్ ను అటవీ ప్రాంతం మీదుగా ఒక కారిడార్ ఏర్పాటు చేశారు. దీనిని కొమురం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించారు. దీనిని మే నెలలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి తగ్గట్టుగా జీవో 49 ని జారీ చేసింది.. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని 36- ఏ నిబంధన ఆధారంగా దీనిని కన్జర్వేషన్ రిజర్వు గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: పిఠాపురంలో వర్మను నమ్ముకున్న వైసిపి..’గీత’ దాటనున్నారా?
ఈ జీవోను తీసుకురావడాని కంటే ముందు స్థానికులతో ప్రభుత్వం సంప్రదింపు జరపాలి. అక్కడి ప్రాంతాలను పరిశీలించాలి. ఆ తర్వాత కన్జర్వేషన్ రిజర్వు గా ప్రకటించాలి.. అయితే ప్రభుత్వం ఇలా చేయకుండానే ఏకపక్షంగా కన్జర్వేషన్ రిజర్వు ప్రకటించిందని ఇక్కడ స్థానికులు అంటున్నారు. మరోవైపు దీనిని అటవీశాఖ అధికారులు ఖండిస్తున్నారు. తాము ఎప్పటికప్పుడు ఆదివాసులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని.. ఆ తర్వాతే ఈ ప్రకటన చేశామని అంటున్నారు. ఆదివాసులు మాత్రం తమను అడవి నుంచి బయటికి పంపించే కుట్రకు అధికారులు పాల్పడుతున్నారని.. దీని కోసం మేము పోరాటం చేస్తామని అంటున్నారు. ఇప్పటికే ఆదివాసులు గవర్నర్ ను కలిశారు. హక్కుల కోసం పోరాడుతామని ఆయన ఎదుట స్పష్టం చేశారు. జీవో 49 ని వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్ ను కోరారు..” కవ్వాల్ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేశారు. ఆ రిజర్వు పరిధిలో మైసంపేట , రాంపూర్ ప్రజలను బయటికి పంపించారు. కనీసం వారికి వసతి కూడా కల్పించలేదు. వారు పుట్టకొకరు, చెట్టుకొకరుగా మారిపోయారు.. పునరావాస కాలనీలలో వసతులు లేకపోవడంతో వారు మళ్ళీ అడవిలోకి వెళ్తున్నారని” స్థానికులు చెబుతున్నారు. జీవో 49 తో కూడా ఇదే పరిస్థితి వస్తుందని.. అందువల్లే తాము అడవుల నుంచి వెళ్లిపోమని ఇక్కడి ఆదివాసీలు అంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.