Anna Mani: వర్షాలు, తుపానులపై భారత వాతావరణ శాఖ కచ్చితమైన అంచనాలు వేస్తోందంటే అదంతా ఆమె చలవే. అందుకే దేశమంతా ఆమెను ‘భారత వాతావరణ మహిళ (వెదర్ విమెన్ ఆఫ్ ఇండియా)’గా పిలుచుకుంటోంది. ఆమే.. భారత తొలితరం మహిళా శాస్త్రవేత్తల్లో ఒకరైన అన్నామణి. నేడు ఆమె 104వ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

12 ఏళ్లకే లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేసి..
కేరళలోని పీర్‌మేడు గ్రామంలో 1918, ఆగస్టు 23న ఓ సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో అన్నామణి జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఎంతలా అంటే.. ఒకసారి తల్లిదండ్రులు ఆమెకు పుట్టినరోజు నాడు వజ్రాల చెవిపోగులు బహుమతిగా ఇచ్చారు. అన్నామణి మాత్రం తనకు అవి వద్దని, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పుస్తకం కావాలని పట్టుబట్టారట. అప్పుడు ఆమె వయసు కేవలం ఎనిమిదేళ్లేనట. 12 ఏళ్లకే తమ ప్రాంతంలోని పబ్లిక్ లైబర్రీలో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివేశారు అన్నామణి. ఎగువ మధ్యతరగతి సంప్రదాయ కుటుంబం ఆమెది. వీరి కుటుంబంలో అమ్మాయిలను ఉన్నత చదువులకు అంగీకరించకుండా పెళ్లికి పరిమితం చేసేవారు. కానీ, మణి సంప్రదాయాలను పక్కనబెట్టి కుటుంబంతో పోట్లాడి మరీ ఉన్నత చదువులకు వెళ్లారు.
Also Read: Bandi Sanjay Padayatra: ‘బండి’ పాదయాత్రకు బ్రేక్ వేసిన కేసీఆర్ సర్కార్.. తగ్గేదేలే అంటున్న సంజయ్
వాతావరణంపై మక్కువతో..
చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలో బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో స్కాలర్‌షిప్ పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సీవీ.రామన్ వద్ద కొంతకాలంపాటు రూబీ, వజ్రాల్లో పరిశోధనలు చేశారు. ఐదు రీసెర్చ్ పేపర్స్‌ను తయారుచేసి పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేయని కారణంగా ఆమెకు పీహెచ్‌డీ దక్కలేదు. దీంతో 1945లో ఆమె మాస్టర్స్ కోసం లండన్ ఇంఫీరియల్ కాలేజీకి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక ఆమెకు వాతావరణ శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. దీంతో వాతావరణ శాఖ పరికరాల విభాగంలో స్పెషలైజేషన్ పూర్తిచేశారు. అనంతరం భారత్ తిరిగొచ్చి పుణెలోని వాతావరణ శాఖలో చేరారు.

స్వదేశీ వాతావరణ పరికరాలకు మార్గం వేసి..
పుణెలో పనిచేస్తున్నప్పుడే వాతావరణ పరికరాలపై అనేక పరిశోధనలు చేశారు. మన దేశం ఈ పరికరాల కోసం ఎక్కువగా బ్రిటన్‌పై ఆధారపడాల్సి వస్తోందని గమనించిన ఆమె.. స్వదేశీ పరికరాల కోసంకృషి చేశారు. దాదాపు 100 పరికరాలను దేశంలోనే తయారుచేసుకునే విధంగా ప్రమాణాలను రూపొందించారు. గాలి వేగం, సౌర విద్యుత్‌ను కొలిచేందుకు తయారుచేసిన పరికరాలతో ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేశారు. ఆమె చేసిన పరిశోధనలే.. నేడు భారత వాతావరణ శాఖ కచ్చితమైన అంచనాలకు పునాదులు వేశాయి. ఈ రంగంలో ఆమె చేసిన సేవలకు గానూ అన్నామణిని వెదర్ విమెన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. పలు అవార్డులతో సత్కరించారు.
వివాహ బంధానికి దూరం..
అన్నా మణి చిన్నప్పటి నుంచి గాంధేయవాదిగా ఉన్నారు. మహాత్ముడి వైకోమ్ సత్యాగ్రహ నుంచి స్ఫూర్తి పొందిన ఆమె అప్పటి నుంచి కేవలం ఖాదీ వస్త్రాలనే ధరించేవారు. వివాహ బంధానికి కూడా దూరంగా ఉన్నారు. 1976లో భారత వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. 2001 ఆగస్టు, 16న తన 83వ పుట్టినరోజుకు సరిగ్గా వారం రోజుల ముందు అనారోగ్యంతో అన్నామణి కన్నుమూశారు.

