https://oktelugu.com/

వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ.. రేపే ప్రకటన..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తంలోనే రాజకీయం ఉంది. ఆయన ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు.. చంద్రబాబు ఇంతలా ఎగిసిపడింది లేదు. అంతటి బలమైన నేత ఏపీ రాజకీయాల్లో మళ్లీ పుడుతాడని అనుకోలేదు. కానీ ఆయన వారసుడు ఇప్పుడు ఏపీని ఏలుతున్నాడు. కానీ తెలంగాణలో వైసీపీ లేదు. అప్పట్లో ఉన్నా పెద్దగా ప్రభావితం చూపలేదు. ఏపీని ఆనుకొని ఉన్న సరిహద్దు ఖమ్మం జిల్లాలో మాత్రమే వైసీపీ ఉనికి ఉంది. కానీ కేసీఆర్ తో దోస్తానా వల్ల […]

Written By: , Updated On : February 8, 2021 / 11:31 AM IST
Follow us on

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తంలోనే రాజకీయం ఉంది. ఆయన ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు.. చంద్రబాబు ఇంతలా ఎగిసిపడింది లేదు. అంతటి బలమైన నేత ఏపీ రాజకీయాల్లో మళ్లీ పుడుతాడని అనుకోలేదు. కానీ ఆయన వారసుడు ఇప్పుడు ఏపీని ఏలుతున్నాడు. కానీ తెలంగాణలో వైసీపీ లేదు. అప్పట్లో ఉన్నా పెద్దగా ప్రభావితం చూపలేదు. ఏపీని ఆనుకొని ఉన్న సరిహద్దు ఖమ్మం జిల్లాలో మాత్రమే వైసీపీ ఉనికి ఉంది. కానీ కేసీఆర్ తో దోస్తానా వల్ల వైసీపీ తెలంగాణలో చాపచుట్టేసింది.కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీని జగన్ ఏలుతుండగా.. ఆయన చెల్లెలు షర్మిల తెలంగాణపై దండయాత్రకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. మంచి వాక్చాత్యుర్యంతో ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపించే వైఎస్ షర్మిల వైఎస్సార్‌‌ రాజకీయ వారసురాలిగా తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారా..? ఆ పార్టీకి ఇప్పటికే పేరు కూడా డిసైండ్‌ అయిందా..? పార్టీ జెండా కూడా రూపుదిద్దుకుందా..? ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందా..? త్వరలోనే విధివిధానాలు వెల్లడికానున్నాయా..? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే హాట్‌ టాపిక్‌ అయింది.

ప్రధానంగా షర్మిల పార్టీని సంస్థాగతంగా నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆషామాషీగా కాకుండా ఒక లక్ష్యంతో పార్టీని ఆవిర్భావంలోకి తెచ్చి.. దానికి తన తండ్రి పేరునే పెట్టి.. తన తండ్రి లక్ష్యాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు షర్మిల పార్టీ పెట్టడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. ఆ ఊహాగానాలు మరికొద్ది రోజుల్లో నిజం కాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. షర్మిల పార్టీ ప్రకటనపై తేదీ కూడా ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఈనెల 9న అంటే వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి-విజయమ్మల పెళ్లి రోజు సందర్భంగా ఈ పార్టీ ప్రకటన ఉండవచ్చనేది సమాచారం అందుతోంది.

తన తండ్రి మార్క్‌నే వాడుకునే ప్రయత్నమే షర్మిల చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో పార్టీని.. ప్రభుత్వాన్ని తన తండ్రి ఎలా అయితే నడిపించారో.. ప్రజల కోసం ఎలాంటి హామీలు ఇచ్చారో.. వాటిని ఎలా అమలు చేశారో కూడా షర్మిల స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటికనుగుణంగానే తెలంగాణలోనూ ప్రజల కోసం పార్టీ ఆవిర్భావం సందర్భంగా పలు హామీలను ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీని పల్లెపల్లెనా విస్తృతం చేసేందుకు తగిన కార్యాచరణ సైతం రూపకల్పన చేస్తున్నారు.

తెలంగాణ వేదికగా మరోపార్టీ ఆవిర్భావం కాబోతోందనేది సుస్పష్టం. షర్మిల పార్టీ ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులే సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా వైఎస్సార్‌‌ అభిమాన నేతలు అందరూ ఆమె వెంట నడిచే అవకాశాలూ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ మరింత ఖాళీ కావడం ఖాయం. అటు అధికార పార్టీ నుంచి కూడా వలసలు ఉండే ప్రమాదం లేకపోలేదు. ఇక బీజేపీ నుంచి కూడా వైఎస్సార్‌‌ అభిమానులైన డీకే అరుణ లాంటి నేతలు కూడా షర్మిలతో వచ్చే పరిస్థితులే ఉన్నాయంటున్నారు.

తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే ఆమె ఏపీలో పాదయాత్ర కొనసాగించారు. అయితే.. షర్మిల ఏపీ ప్రజలతో పాటే తెలంగాణ ప్రజలకూ సుపరిచితురాలే. తన తండ్రి వైఎస్సార్‌‌ అమలు చేసిన ప్రతీ స్కీమ్‌ ఇంటింటికీ అందింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రాంతీయ తేడాలు లేకుండా అందరికీ పథకాలు వర్తింపజేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటేనేమీ.. ఆరోగ్యశ్రీ.. 108.. ఇందిరమ్మ గృహం.. ఇవే ఏంటి ఇంకా ఎన్నో స్కీమ్‌లతో అందరికీ ఫలాలు అందాయి. అందుకే.. తెలంగాణ ప్రజలు ఆయనను ఇంకా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూనే ఉన్నారు. కొందరైతే తమ ఇండ్లలో ఆ మహానేత ఫొటోలు పెట్టుకొని కొలుస్తున్నారు.

ఇప్పుడు.. వైఎస్సార్‌‌ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు వైఎస్‌ షర్మిల. తన తండ్రి చేసిన అభివృద్ధిని.. తన తండ్రి అందించిన పాలనను తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తుచేసేందుకు రెడీ అయ్యారు. మళ్లీ తెలంగాణలో రాజన్న పాలనను తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీ ప్రకటనపై ఆమె ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే నాటి వైఎస్సార్‌‌ అభిమాన నేతలు ఇప్పుడు ఆమె తరఫున నడిచేందుకు కూడా సిద్ధమయ్యారట. పార్టీ ప్రకటన నాటి నుంచే వారు పార్టీలో యాక్టివ్‌ రోల్‌ ప్లే చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ ఎలా ఉండాలి..? ఎలా నడిపించాలి..? అధికార పార్టీని ఎలా తట్టుకోవాలి..? బీజేపీ దూకుడును ఎలా ఆపాలి..? వీటిపైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టనున్నట్లు సమాచారం. ఇందుకు మరికొంత మంది సీనియర్‌‌ లీడర్లను కూడా ఆమె కలువబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా గ్రూపులో, వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. షర్మిలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

-శ్రీనివాస్

  • వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న పోస్టులు ఇవే..