
దేశంలో ఒకవైపు కరోనా తాండవిస్తుండగా, మరోవైపు బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ముందే నిర్ణయించిన సమయానికే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ పలు రాజకీయ పార్టీ పార్టీల నుంచి విజ్ఞప్తులు వచ్చినా వినలేదు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగియనుంది. ఈ క్రమంలో ఆ గడువులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగితేలుతున్నాయి.
బీహార్ శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 28న, రెండో విడత నవంబర్ 3న, మూడో విడత ఎన్నికలు నవంబర్ 7న నిర్వహిస్తారు. నవంబర్ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో 17 జిల్లాల్లోని 94 స్థానాలకు, మూడో దశలో 78 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికలు ఇప్పుడు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. బీహార్ ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. గతంలోనూ బీహార్ ఎన్నికల్లో గెలుపు సాధించాలని అటు నరేంద్ర మోడీ.. ఇటు రాహుల్‌గాంధీ ముప్పుతిప్పలు పడినా లాభం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు రాజకీయ పార్టీలకు పరీక్షలా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బీహార్ ఎన్నికలు తొలి ఛాలెంజ్ లాంటివనే చెప్పొచ్చు.
అప్పట్లో రాహుల్ ప్రధాని కావాలనే డిమాండ్ కాంగ్రెస్ నుంచి మొదలైంది. ఆ పరిస్థితుల్లో బీహార్‌లో పార్టీని గెలిపించి సత్తా చాటాలని రాహుల్ ఉబలాటపడ్డాడు. అయితే ఆయన ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. రాహుల్‌కు రాజకీయంగా తగిలిన తొలి ఎదరుదెబ్బ కూడా ఇదే. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన మోడీకి బీహారీలు షాక్ ఇచ్చారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తయ్యింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూలు కలిసి పోటీ చేశాయి. బీహార్‌లో బీజేపీని గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు మోడీ. బీహార్ బాగు కోసం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్రచారం ఏమాత్రం ఓట్లు రాల్చలేకపోయింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ కూటమి స్వీప్ చేసింది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలు సంచలన విజయాలను సాధించాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి చిత్తయ్యింది. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీట్లో గెలిస్తే, ఆర్జేడీ లోక్ సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని అంచనాకు వచ్చారు. అయితే.. గత రెండు పర్యాయాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పరస్పర విరుద్ధమైన ఫలితాలను ఇస్తున్నారు బీహారీలు.
ఈ సారి బీజేపీ, జేడీయూలు కూటమిగా వెళ్తున్నాయి. ఎల్జేపీ సోలోగా పోటీ చేస్తూ ఉన్నా.. అదంతా బీజేపీ వ్యూహ ప్రకారమేనని తెలుస్తోంది. దళితుల ఓట్లను చీల్చడానికి ఎల్జేపీ సోలోగా పోటీ చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఏకంగా 30 లక్షల మందికిపైగా వలస కూలీలను కలిగిన రాష్ట్రం బీహార్. కరోనా పరిస్థితుల్లో బాగా ఇబ్బంది పడిన వర్గం అది. ఇలాంటి నేపథ్యంలో కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుకు కూడా బీహార్ ఎన్నికలు ఒక పరీక్ష లాంటివి కాబోతున్నాయి. ఎప్పుడూ విలక్షణమైన తీర్పునిచ్చే బీహారీల ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. అలాగే.. వలస కూలీల మీదనే బీజేపీ పెట్టుకున్న ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.