తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ రహదారిపై పట్టపగలు, నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాద జంటను నరికేసిన వైనం సంచలనమైంది. దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది. అన్ని కోర్టులు, బార్ అసోసియేషన్లు ఖండించాయి. ఈ క్రమంలోనే అసలు హత్యకు గురైన వామనరావు ఎవరు? ఏం చేస్తుంటారు? టీఆర్ఎస్ నేతలతో ఆయనకు విభేదాలు ఏమిటి? హత్యకు ముందు ఏం జరిగింది? ఆయనను ఎందుకు చంపారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా)లోని మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వాహనరావు, ఆయన భార్య గట్టు నాగమణి హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారు. వామనరావు అన్యాయాన్ని ఎదురించే న్యాయవాది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా ముక్కుసూటిగా ప్రశ్నిస్తుంటారు. అన్యాయాలపై హైకోర్టుల్లో పిటీషన్లు వేస్తూ నేతలను కోర్టుకు ఈడీస్తుంటారు. అవినీతి, అక్రమాలు చేసిన నేతలు, పోలీసుల గుండెల్లో నిద్రపోతున్నారు. ఏ రాజకీయపార్టీని అయినా సరే వామన్ రావు నిలదీస్తుంటారని.. కోర్టుల్లో వారిపై పిటీషన్లు వేస్తూ ఇరుకునపెడుతుంటారని పేరుంది.అన్యాయాలపై కొదమ సింహంలా విరుచుకుపడి బాధితులకు అండగా న్యాయం చేస్తారని చెబుతున్నారు.
అప్పట్లో పెద్ద పల్లి జిల్లాలో శీలం రంగయ్య అనే దళితుడు పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కాగా హైకోర్టులో వామన్ రావు పిటీషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు ఈ వ్యవహారంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ను విచారణ అధికారిగా నియమించింది. ఈ క్రమంలోనే ఈ కేసు విత్ డ్రా చేసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు వామనరావును బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.
ఈ కేసు విషయంలోనే ఇటీవలే రామగుండం సీపీ సత్యానారాయణతోనే వాహనరావు, నాగమణిలు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకి వ్యతిరేకంగా వామనరావు పలు కేసు వాదిస్తున్నారు.
హత్యకు గురైన న్యాయవాది గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి పలు కీలక కేసుల్లో న్యాయవాదులుగా ఉన్నారు. మంథనిలో ఇసుక మాఫియాపై, కులాంతర వివాహం చేసుకున్న ఒక ఎస్సీ యువకుడి హత్యలో ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల కంటే వందల రెట్లు అధికంగా ఆస్తులు ఉన్నాయని.. ఇలా పలు కేసులు వేశారు. 2019లో మంథని పోలీసు స్టేషన్‌లో శీలం రంగయ్య అనే దళితుడ్ని లాక్‌పడెత్ చేశారని మరో కేసు వేశారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ స్వయంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లాక్‌పడెత్ కేసు ఈ నెల 8న మరోసారి విచారణకు వచ్చింది. ఇక శీలం రంగయ్య కేసు వేసినందుకు పోలీసులు వేధిస్తున్నారని.. మంచిర్యాలలో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని సీజేకు వామనరావు విన్నవించారు. దీంతో వామనరావు దంపతులను ఏ కేసులోనూ విచారణకు హాజరు కావాలంటూ పిలవరాదని గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 9వరకు పొడిగించింది. అయితే మంథని కోర్టు కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయనను ప్రత్యర్థులు పకడ్బందీగా హత్య చేశారు.
వామన్ రావుకు.. ఈయనను హత్య చేసిన కుంట శ్రీనివాస్ కు మధ్య తీవ్ర గొడవులు అయ్యాయని గుంజపడుగు గ్రామస్థులు చెబుతున్నారు. గుంజపడుగ గ్రామంలోని ఓ భూవివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. 21 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ కొంతకాలంగా కుంటా శ్రీనివాస్ పై న్యాయవాది వామన్ రావు కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. గ్రామంలోని రామాలయం కమిటీ ఏర్పాటుపై వామన్ రావు విభేదించారు. పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని కుంట శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. దీనిపై పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం అనుమతి లేకుండా ఏలా ఏర్పాటు చేస్తారంటూ వామన్ రావు ప్రశ్నించారు. వామన్ తనకు గ్రామంలో అడుగడుగునా అడ్డుపడుతున్నాడనే అక్కసుతో ఈ హత్య జరిగినట్లు ప్రచారం సాగుతోంది.
వామన్ రావు ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై కేసులు వేయడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన తండ్రి , విశ్రాంత ఉపాధ్యాయుడు గట్టు కిషన్ రావు ఆరోపించారు. ఈ హత్య వెనుక టీఆర్ఎస్ పెద్ద పల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, గుంజపడుగుకు చెందిన రిటైర్డ్ డీఈఈ వసంత్ రావు హస్తం ఉందని ఆరోపించారు. మొత్తంగా అన్యాయాలను ఎదురిస్తూ అధికార పార్టీ నేతల కంట్లో నలుసుగా మారాడని.. చెబితే వినడం లేదనే అక్కసుతోనే ఈ న్యాయవాద దంపతులను హత్య చేసినట్టు తెలుస్తోంది.