
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బోల్తాపడ్డారులే ఈ ఏపీ బీజేపీ నేతలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గుచూపడం.. దీన్ని ఆపించేస్తామని ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం.. అక్కడి నుంచి ఉత్తి చేతులతో ఏపీకి రావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏపీ ప్రజల్లో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సెంటిమెంట్ నడుస్తోంది. ఈ క్రమంలోనే దాన్ని అధిగమించలేకపోతున్నారు బీజేపీ నేతలు.
తాజాగా విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ చేసిన ఏపీ బీజేపీ నేతలు అక్కడి పర్యటించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఆయన వారికి సమాధానం చెప్పలేకపోయారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని.. అలాగే కొనసాగిస్తామని చెప్పలేక ఏడాది వరకు కాదంటూ తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నాన్చే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి ఏపీ బీజేపీ నేతలు విశాఖ ఉక్కు సమస్యపై అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయారని అర్థం చేసుకోవచ్చు.