దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా పూర్తిస్థాయిలో కట్టడి కావడం లేదు. కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ అమలైన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మూతబడిన సంగతి తెలిసిందే. అన్ లాక్ సడలింపుల అనంతరం పరిమిత సంఖ్యలో మాత్రమే టీటీడీ భక్తుల దర్శనానికి అనుమతిస్తోంది.
అయితే టీటీడీ ప్రస్తుతం వృద్ధులు, చిన్నారులను దర్శనానికి అనుమతించడం లేదు. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కరోనా నూతన మార్గదర్శకాలు వచ్చిన తరువాత చిన్నారులు, వృద్ధుల దర్శనాల విషయంలో నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఆర్జిత సేవలకు టికెట్లు బుకింగ్ చేసుకున్న భక్తులు టికెట్ల రీఫండ్ ను పొందవచ్చని జవహర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమలలో పెళ్లిళ్లకు అనుమతులు ఇస్తున్నామని.. 200 మందిలోపు ఆహ్వానితులతో తిరుమలలో పెళ్లిళ్లకు హాజరు కావచ్చని జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని చెప్పారు.
తిరుమలకు వచ్చే భక్తులు దర్శన సమయంలో విధిగా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వినియోగించడం చేయాలని జవహర్ రెడ్డి సూచించారు. టీటీడీ వెబ్ సైట్ తో పాటు అమెజాన్ ఆన్‌లైన్ సర్వీసెస్‌లోనూ క్యాలెండర్లు, డైరీలను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.