ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. పోనీ ఆయనది ఎన్నికలు జరుగుతున్న జిల్లా వాసి అంతకన్నా కాదు. ఆ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధమూ లేదు. కానీ.. అక్కడ వాలిపోయాడు.. నామినేషన్ వేశాడు. చివరికి అధికార పార్టీకి చుక్కలు చూపించాడు. ఇదంతా నిన్నటి దుబ్బాక ఫలితాల్లో వెల్లడైంది. అవును.. దుబ్బాకలో టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఓ స్వతంత్ర అభ్యర్థి అని కూడా తెలుస్తోంది.
Also Read: టీఆర్‌ఎస్ వల్లే బీజేపీ గెలిచిందా..!
కారును పోలిన గుర్తును ఆ స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. దీంతో దుబ్బాక ఓటర్లు తికమక పడి.. కారును పోలిన ఆ గుర్తుకు ఓటేయడంతో కొంత నష్టం కలిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ కారును పోలిన ఆ గుర్తు ఏంటనుకుంటున్నారా? చపాతీలు చేసే పీట (రోటీ మేకర్). దానిపై అప్పడాల కర్ర కూడా ఉంది. ఆ గుర్తు కారును పోలినట్లుగానే ఉంది. అంతేకాదు.. మొదటి ఈవీఎంలో మూడో వరుసలో కారు గుర్తు ఉండగా.. రెండో ఈవీఎంలో మూడో వరుసలోనే ఈ రోటీ మేకర్ గుర్తు ఉంది. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కామన్‌గా ఈవీఎంలోని మూడో నంబర్‌కు ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. దీంతో చాలా మంది ఓటర్లు సెకండ్ ఈవీఎంలోని మూడో నంబర్‌కు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.
Also Read: టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసిన సోషల్ మీడియా
ఇక ఆ స్వతంత్ర అభ్యర్థి పేరు బండారు నాగరాజు. అతనికి ఈ ఎన్నికలో 3,489 ఓట్లు పడ్డాయి. ఈ మూడు పార్టీల తర్వాత నాగరాజు ఏకంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కారును పోలిన సింబల్‌ను నాగరాజుకు కేటాయించడంతోనే టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన ఓట్లన్నీ అతనికి పడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఈ ఉప ఎన్నికలో మొత్తం 1,64,186 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోలవ్వగా, అందులో 1381 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 60 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.