2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేస్తే టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగిందని.. అయితే ఆ విషయాన్ని రాజకీయ పార్టీగా ఆనాడు గ్రహించలేకపోయామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ దే గెలుపే కాదన్నారు. మజ్లిస్ పార్టీతో స్నేహంతో లేకపోయింటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో కూడా టీఆర్ఎస్ గెలిచేది కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం కారణంగా హైదరాబాద్ లో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోలేకపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 15 రోజుల తర్వాత న్యాయబద్దంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించి ఉంటే మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకునేదని అన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ను ఎవరూ రక్షించలేరని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రానున్న రెండేళ్లు బీజేపీకి ఎంతో కీలకమని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. ఆ మార్పు బీజేపీతో మొదలు కావాలని ప్రజలు కోరుకుంటు్నారని చెప్పారు.
తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.