
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై గతంలో రాజద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు ఎంపీ. అయితే.. బెయిల్ ఇచ్చిన సమయంలో సీఐడీ కోర్టులో బెయిల్ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. కానీ.. అవి సమర్పించినా మిస్సయ్యాయి. దీంతో.. ఆ బాండ్లను తిరిగి సమర్పించేందుకు మరోసారి సుప్రీంను ఆశ్రయించారు నర్సాపురం ఎంపీ.
గల్లంతైన బాండ్లను తిరిగి సీఐడీ కోర్టులో సమర్పించేందుకు రఘురామరాజు సుప్రీం కోర్టు అనుమతి కోరాల్సి వచ్చింది. సీఐడీ కోర్టు సూచన మేరకు ఇవాళ సుప్రీం కోర్టుకు వెళ్లారు ఎంపీ. ఈ విషయాన్ని పరిశీలించిన సుప్రీం.. కనిపించకుండా పోయిన బాండ్లను తిరిగి సీఐడీ కోర్టులో సమర్పించేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. దీంతో.. రఘురామకు ఊరట లభించింది.
ఎంపీ రఘురామపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఎంపీ రఘురామతోపాటు మరో రెండు తెలుగు న్యూస్ ఛానళ్లను సైతం నిందితులుగా చేర్చింది. ఈ కేసులో బెయిల్ పొందిన రఘురామ.. సొంత పూచీకత్తుతోపాటు మరో ఇద్దరు కూడా పూచీకత్తు సమర్పించాల్సి వచ్చింది.
ఇందుకు సంబంధించిన పత్రాలు మిస్సవడంతో.. వీటిని తిరిగి సీఐడీ కోర్టులో సమర్పించేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది సుప్రీం. ఇదిలాఉంటే.. రాజద్రోహం కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారని, ఈ క్రమంలో వీరి మధ్య భారీగా డబ్బులు చేతులు మారాయని కూడా సీఐడీ సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. మరి, ఈ కేసులో తుది తీర్పు ఎలా వస్తుందో చూడాలి.