పెళ్లై మూడునాలుగేళ్లయినా ఇంకా సంతానం అందట్లేదు అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారిని మీరు చూసే ఉంటారు. మీ ఊళ్లో, చివరకు మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారు ఉండొచ్చు. ఇది వరకు ఎక్కడో ఒక చోట కనిపించిన ఈ సమస్య.. ఇప్పుడు మరింత విస్తరించింది. అయితే.. సమస్య అందరికీ తెలుసుగానీ.. కారణం ఏంటన్నది చాలా మందికి తెలియదు. పరిష్కారం అంతకన్నా తెలియదు. కేవలం డాక్టరు ఏం చెబితే అది మాత్రమే చేస్తున్నారు. కానీ..చేయాల్సింది వేరే ఉంది!
వైద్యులు చెబుతున్న కారణాల్లో ప్రధానంగా రెండే వినిపిస్తుంటాయి. ఒకటి పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడం కాగా.. రెండోది మహిళల గర్భాశయంలో నీటి బుడగలు. ఇవి రెండు సమస్యలు చెబుతున్న వైద్యులు మందులతోనే సంతానాన్ని వృద్ధి చేసేందుకు యత్నిస్తుంటారు. అసలు ఇలా ఎందుకు వచ్చిందని చాలా మంది డాక్టర్లు చెప్పరు. దీనికి కూడా కారణాలు రెండు. ఒకటి వారికి తెలియకుండానైనా ఉండాలి. లేదా.. ఉద్దేశపూర్వకంగా చెప్పుకుండానైనా ఉండాలి.
అసలు స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతుంది? గర్భాశయంలో నీటి బుడగలు అనిచెప్పే పీసీవోడీ సమస్య ఎందుకు వస్తుంది? అనేది సాధారణ జనానికి తెలియదు. తాజాగా విడుదలైన ఓ అధ్యయనం దీని వెనకున్న కారణాల గుట్టును రట్టు చేసింది. ఈ పరిస్థితి రసాయనాలే కారణాలుగా ప్రకటించింది. రసాయనాలు మనం ఎక్కడ వాడుతున్నాం అంటారేమో! మన ఇంట్లో అడుగడుగునా ఉన్నవి రసాయనాలే. వీటి ఫలితంగానే సంతాన సాఫల్యత వేగంగా తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు.
దీనిక నిర్దిష్టమైన లెక్కలు కూడా చూపుతున్నారు. 1973 నాటి మనునషులతో పోలిస్తే.. ఇప్పటికి ఏకంగా 60 శాతం మేర వీర్యకణాల సంఖ్య తగ్గిపోయిందని ప్రకటించారు. కేవలం వీర్యకణాల సంఖ్య తగ్గడమే కాకుండా.. పురుషుల అంగం సైజు కూడా తగ్గిపోయిందని తేల్చారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2045 నాటికి స్పెర్మ్ కౌంట్ సున్నాకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే.. మానవజాతి మనుగడకు ముప్పు వాటిల్లినట్టేనని అంటున్నారు.
ఈ పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ప్రతీ మూల రసాయనాలతో నిండిపోతోంది. ఒంటికి రాసుకునే సబ్బులు మొదలు.. ఇల్లు తుడవడానికి వాడే క్లీనర్స్ వరకు అన్నీ రసాయనాలతో నిండిపోయాయని చెబుతున్నారు. నెత్తికి రుద్దుకునే షాంపూలు, ఇంటికి వేసే పెయింటింగ్స్, బాత్ రూమ్ క్లీనర్స్, ప్లాస్టిక్ వస్తువులు, కెమెరాలు, నాన్ స్టిక్ వంట పాత్రలు కూడా ఈ దారుణమైన రసాయనాలను వెద జల్లుతున్నాయని చెబుతున్నారు. అంతెందుకు.. ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసుకున్న తర్వాత వచ్చే స్లిప్పును ముట్టుకున్నా కూడా ముప్పు తప్పదని అంటున్నారు.
ఇలా.. ఒకటేమిటీ ప్రతీ వస్తువు మానవ జాతి మనుగడనే దెబ్బతీస్తోందని చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కొన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటుండగా.. మరికొన్ని దేశాలు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక, చాలా దేశాల్లో అసలు ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదని అంటున్నారు. ప్రపంచం మొత్తం కలిసి కట్టుగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా.. మానవ మనుగడకే ప్రమాదమని చాటి చెబుతున్నారు. మరి, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.