రాజకీయ నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ఎంతముఖ్యమో.. పరిస్థితులను బట్టి నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం కూడా అంతే అవసరం. ఏ పరిస్థితుల్లో అలాంటివి చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరిస్తే గండం గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారే ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువకాలం మనుగడ సాగించగలుగుతారు. అలా కాకుండా నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ల అనుభవాలను పరిణగలోకి తీసుకొని జూనియర్లు అడుగులు వేస్తే వారి భవిష్యత్ కు ఢోకా ఉండదు. సీఎం కేసీఆర్ తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. రాజకీయంగా వ్యూహా ప్రతీవ్యూహాలు రచించడంలో ఆయన్ను మించిన వారుండరు. మాటలను తూటాళ్ల పేల్చడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలను ఎలా వాడుకోవాలో ఆయన తెల్సినంతగా మరేవరికీ తెలియదు. అవసరానికి తగ్గట్టుగా కేసీఆర్ కేంద్రంలోనీ బీజేపీ వాడుకోవడం ఆయన నేర్పరితనానికి నిదర్శనం.
టీఆర్ఎస్ పై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వస్తుందని గ్రహించగానే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలు మరిచిపోయేలా పావులు కదుపుతుంటారు. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు అర్థమయ్యే వివరించడంలో ఆయన ఎల్లప్పుడు ముందుంటారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని సంక్షేమ పథకాలు తాము చేస్తున్నట్లు ఆయన చెబుతుంటారు. విపక్ష పార్టీలతోపాటు కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు.
ప్రజల్లో తిరిగి తమపై నమ్మకం కలిగేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఎంతో గొప్పగా ఉంటాయో వివరించే ప్రయత్నం చేస్తూ వారి మనసు ప్రత్యర్థి పార్టీలవైపు మరలకుండా చూస్తుంటారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు వందకు వందశాతం మార్కులు పడుతాయి. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో వెనుకబడి పోతున్నారు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు విరివిగా అమలు చేస్తున్నా వాటిని ప్రజలకు వివరించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు.
ఏపీలో కరోనా ఎంట్రీ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లడమే కష్టంగా మారింది. కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ పథకాలపై ప్రకటనలు ఇస్తున్నా సీఎం జగన్ వాటిని నేరుగా ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. సీఎంగానీ, మంత్రులుగానీ వాటిని నేరుగా ప్రజలకు అర్థమయ్యే వివరించే ప్రయత్నం చేస్తే వాటికి అనుకున్న ఫలితం ఉంటుంది. కానీ అధికార పక్షం అలాంటి ప్రయత్నమే చేయడం లేదు.
ప్రజలు తమను ప్రతీ ఎన్నికల్లో ఆదరిస్తున్నారనే ధీమా సీఎం జగన్మోహన్ రెడ్డిలో వ్యక్తమవుతోంది. అందుకే ఆయన వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని సీఎం జగన్ గట్టిగానే తిప్పికొట్టకపోతే మాత్రం భవిష్యత్ లో ప్రమాదంగా మారే అవకాశం ఉందనుంది. కనీసం పెట్రోల్, డిజీల్ ధరల పెంపు పాపం ఎవరిది? అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది? కేంద్రం నుంచి నిధులు ఎన్ని వస్తున్నాయి? ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందనే అంశాలపై అయినా సీఎం జగన్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
లేనట్లయితే 2023 నాటికి ఇవన్నీ సీఎం జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మరీ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఆలోచిస్తారా? లేదంటే మొండిగానే ముందుకెళుతారా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!