రాజ్యాంగ పదవిలో ఉంటూ ఏపీలోని జగన్ సర్కార్ ను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేస్తున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరుపై వైసీపీ నేతల నుంచే కాదు.. ఇప్పుడు ఇతర పార్టీల నేతలు, దిగ్గజాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం సైతం తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరును కడిగిపారేశారు. తాజాగా ఆయన సంచలన లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేశ్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే ఆయన వెనక అదృశ్యశక్తి నడిపిస్తుందని అనుమానం కలుగుతోందని ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ముద్రగడ చేస్తున్న దాడిని చూస్తుంటే అలానే అనిపిస్తోందన్నారు.
ఏపీలోని పరిస్థితిని అర్థం చేసుకోకుండా రాజకీయ నాయకుల్లా పట్టుదలకు పోయి పంచాయితీ ఎన్నికలను నిర్వహించి తీరుతాం అంటూ పట్టుదలకు పోరాదని హితవు పలికారు. ఇప్పటికైనా ఎన్నికలంటూ రచ్చ చేయడం మానేసి ఎస్ఈసీ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు పోవాలని విజ్ఞప్తి ముద్రగడ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ముద్రగడ లేఖలో ఎస్ఈసీ నిమ్మగడ్డకు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి ఒక్క భారత దేశంలోనే తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. మీకు వీలైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండని.. వీలైతే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండని లెటర్ లో పేర్కొన్నారు.
ఓ వైపు కరోనా విజృంభణ.. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా పంచాయితీ ఎన్నికలు నిర్వహణ ఏంటి అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వైఖరిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.