తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా రజనీకాంత్ అనారోగ్యానికి గురవడంతో ఆయన అభిమానులతోపాటు కుటుంబ సభ్యులు.. సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొన్న సంగతి తెల్సిందే..!
రెండ్రోజులు ఆస్పత్రిలో ఉండి రజనీకాంత్ చికిత్స తీసుకున్నారు. అయితే తన ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు రజనీ ప్రకటించాడు. ఇదే సమయంలోనూ సమాజసేవ మాత్రం కొనసాగిస్తానంటూ రజనీ స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే తాజాగా టీఎంసీ అధ్యక్షుడు జికే వాసన్ తమ పార్టీకే రజనీ మద్దతు ఉంటుందని చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారాయి. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ పార్టీకే రజనీకాంత్ మద్దతు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. జీకే వాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడులో మళ్లీ రజనీకాంత్ చుట్టూ పాలిటిక్స్ తిరుగుతున్నాయి.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతుండంతో అన్ని పార్టీలు వ్యూహాలు.. ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలోనే రజనీ మద్దతును కూడగట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే రజనీ రాజకీయ ఆయా పార్టీలకు మద్దతు ఇస్తారా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!