కన్నడ నటుడు ప్రకాష్ రాజ్ ‘తెలుగు మా అధ్యక్ష పదవి’కి పోటీ చేయడం ఏమిటి ? పైకి అనకపోయినా మంచు విష్ణు ప్రశ్న ఇది. తెలుగు సినిమా రంగ నటీనటుల సంఘంలో ప్రకాష్ రాజ్ కూడా మెంబరే కదా. అలాంటప్పుడు మా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఆయనకు ఎందుకు లేదు ? ఇది ప్రకాష్ రాజ్ మద్దతు దారుల అభిప్రాయం. మొత్తానికి ఈ సారి కూడా ‘మా’ ఎన్నికలు సంచలనం సృష్టించేలా వున్నాయి.
ఇప్పటికే హీరో మంచు విష్ణు పోటీ పడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మరోపక్క ప్రకాష్ రాజ్ గత రెండు నెలలుగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి వీరిలో ఎవరికీ ఎవరు సపోర్ట్ ఉంటుంది ?. ‘మా’ ఎన్నికలకు మెగాస్టార్ మద్దతు కీలకం, మెగాస్టార్ ఎవరికీ సపోర్ట్ చేస్తే వారు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి, ముందుగానే ప్రకాష్ రాజ్ చిరును సంప్రదించి, అనుమతి పొందాడు అని, చిరు కూడా మద్దతు ఇస్తానని అభయం ఇచ్చాడని తెలుస్తోంది.
అయితే, టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, మెగాస్టార్ మద్దతు తమకు లేదు గనుకే, మోహన్ బాబు ఫ్యామిలీ సూపర్ స్టార్ కృష్ణను కలిసి మహేష్ బాబు మద్దతు కోసం ప్రయత్నాలు చేశారట. కృష్ణ తన మద్దతును మంచు విష్ణుకే అని చెప్పారట. అలాగే ఈ రోజు మంచు ఫ్యామిలీ బాలయ్య బాబును కలవబోతున్నారు.
ఎన్నికల్లో గెలవాలంటే బాలయ్య మద్దతు చాల అవసరం. ఒక విధంగా ‘మా’ మెంబర్స్ లో బాలయ్య వర్గమే ఎక్కువగా ఉన్నారు. అందుకే మంచు విష్ణు, బాలయ్య సపోర్ట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, గత ఏపీ రాజకీయ ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ టీడీపీకి వ్యతిరేకంగా పని చేసింది. మరి ఇప్పుడు బాలయ్య, మంచు ఫ్యామిలీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు అనేదే మిలియన్ల డాలర్ల ప్రశ్న.
వీరిద్దరి వ్యవహారం ఇలా ఉంటే సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ కూడా ముందుగానే తన వంతు పావులు కదిపారు. ముఖ్యంగా గత కరోనా, అలాగే ఈ కరోనా టైమ్ లో ఆయన తన వర్గానికి చెందిన రెండు వందల మందికి అవసరం ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు. తన వర్గంలో ఒక్కరు కూడా చేజారకుండా నరేష్ జాగ్రత్త పడ్డాడు. కాబట్టి, నరేష్ వైపు నుండి వచ్చే సపోర్ట్ అత్యంత కీలకం కానుంది.
నిజానికి మంచు విష్ణుకి ఆసక్తి వుందని తెలియడంతో నరేషే స్వయంగా నీకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పినట్లు టాక్. అందుకే మంచు ఫ్యామిలీ కృష్ణను కలిసారట. ఒకవేళ బాలయ్య, చిరు సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి ఉన్నా, ఒక్క నరేష్ సపోర్ట్ ‘మంచు విష్ణు’కి ఉంటే, విష్ణు గెలవడం ఖాయం. మొత్తానికి ఇప్పుడు బాలయ్య, చిరు కంటే నరేష్ కీలకం కానున్నాడు.