జనసేనాని పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉన్నారు. వీకెండ్ కావడంతో షూటింగ్ లకు గ్యాప్ ఈరోజు అమరావతిలో పర్యటించారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మార్పు మొదలైందని.. వ్యవస్థలో సమూల మార్పునకు పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని పవన్ అన్నారు.
ఏపీ వ్యాప్తంగా 65శాతం పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు ద్వితీయ స్థానంలో నిలవడం మార్పునకు సంకేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 1209 సర్పంచ్ లు, 1176 ఉప సర్పంచ్ లు, 4456 మంది వార్డు సభ్యులుగా జనసేన భావజాలం, మద్దతు కలిగిన వారు గెలుపొందటం సంతోషంగా ఉందన్నారు.
పంచాయతీల్లో జనసేన విజయం వ్యవస్థలో వస్తున్న మార్పునకు నిదర్శనమని వన్ అన్నారు. మొత్తం మీద 27శాతం ఓటింగ్ ను తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పొందారని పవన్ అన్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలే జనసేనకు విజయాన్ని కట్టబెట్టాయని పవన్ అన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులు, పెదపెంకి బోదకాలుపై పోరాటం సహా పంచాయతీ వ్యవస్థలో లోపాలపై ప్రజాప్రతినిధులను జనసైనికులు నిలదీయడమే ఈ విజయానికి కారణమని పవన్ అన్నారు.
పల్లెలపై గుత్తాధిపత్యం ఉన్న వారిపై పోటీచేసి జనసైనికులు సాధించిన విజయం నిజంగా స్ఫూర్తినిస్తోందని.. కేరళ తరహాలో పంచాయతీలను అభివృద్ధి చేస్తామని పవన్ తెలిపారు.