‘నీది ఏ కులం’ అని ప్రశ్న ఎదురైనప్పుడల్లా జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పే మాట ‘భారతీయుడి’ని అని.. కులం, మతం తనకు లేదంటూ భారతీయమే తన కులం, మతం అంటూ దేశభక్తి భావాలను పవన్ ఉప్పొంగిస్తుంటాడు. అయితే పవన్ తాజాగా రూట్ మార్చేశాడని అంటున్నారు.. కాపు సామాజికవర్గం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ ను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజికవర్గమే ఆదరించిన దాఖలాలు లేవు. అన్ని స్థానాల్లోనూ ఓడించి కేవలం ఒక్క స్థానానికే జనసేనను పరిమితం చేశారు. పవన్ రెండు చోట్ల కాపుల ప్రాబల్యమున్న నియోజకవర్గాల్లో పోటీచేసి కూడా ఓడిపోయారు. పంచాయితీ, తిరుపతి ఎన్నికల నేపథ్యంలోనే జనసేన హడావుడి నెలకొంది. ఈ సమయంలో కాపు నేతలు పవన్ ను కలవడం.. పవన్ తాజాగా కాపులు శాసించే స్తాయికి ఎదగాలని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మారిన పవన్ తీరుతో పంచాయితీ ఎన్నికల్లోనైనా కాపులు జనసేనను ఆదరిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇటీవల కాపు సీనియర్ నేత హరిరామ జోగయ్య సారథ్యంలో పుట్టుకొచ్చిన ‘కాపు సంక్షేమ సేన’ను కలుస్తానని చెప్పిన పవన్ అన్నట్టుగానే వారితో భేటి అయ్యారు. భారతీయత ముసుగును తనకు తానే తొలగించుకున్నారు.కాపు సంఘాల ప్రతినిధులను పవన్ కలుస్తున్నారని మీడియాలో వైరల్ అయిన వార్తలు చూశాక పవన్ సైతం ఈ కుల రొచ్చు రాజకీయాలవైపు మరిలారని విమర్శలు వినిపిస్తున్నాయి.దీనివెనుక ఆయన రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని అర్థమవుతోందంటున్నారు.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ నైజం బయటపెట్టేశాడని అంటున్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 27శాతం కాపుల ఓటు బ్యాంకు ఉందని పవన్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. వారంతా కనుక పవన్ వెంట నడిస్తే ఖచ్చితంగా ఏపీలో అధికారం ఆయనదే. కానీ నడవడం లేదనే ఈ కాపులను దగ్గరకు తీస్తున్నట్టు అర్థమవుతోంది. కాపులను చేరదీయడం వెనుక అసలు మతలబు ఇదేనని అంటున్నారు.
శుక్రవారం రాత్రి మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులు పవన్ కళ్యాన్ ను జనసేన కార్యాలయంలో కలిశారు. కాపులంతా ఒక్కటేనని ఈ సమావేశం ద్వారా ఆ సామాజికవర్గానికి పవన్ మెసేజ్ పంపారు.
నిజానికి పవన్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఏపీలో కాపులను పునరేకీకరణ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తాను కాపు నాయకుడినే అన్న సంకేతాన్ని పంపాలనుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, జోగయ్య, సోము వీర్రాజు లాంటి బలమైన వారు ఏకమయ్యారని సంకేతాలను ప్రజలకు, కాపు సామాజికవర్గానికి పంపి వచ్చే పంచాయితీ , తిరుపతి ఎన్నికల్లో లబ్ధి పొందాలని పవన్ ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.
రాష్ట్ర జనాభాలో 27శాతం కాపులున్నారని.. మిగతా 10శాతం మంది పవన్ అభిమానులు ఓట్లేసినా.. లేక బీజేపీ మద్దతు దారులు సపోర్టు చేసినా ఏపీలో జనసేనకు అధికార తథ్యం. అందుకే ఇన్నాళ్లు భారతీయుడిని అని గొప్పలు చెప్పుకున్న పవన్ ఇప్పుడు కులాల కంపులోకి దిగి ఆ బురదను అంటించుకుంటున్నారని అర్థం అవుతోంది. కాపులు రాజకీయాల్లో శాసించే స్థితికి ఎదగాలని కాపు సంక్షేమ సేన ప్రతినిధులకు పిలుపునివ్వడం చూస్తే ఖచ్చితంగా పవన్ రూటు మార్చాడని అర్థమవుతోంది. కాపులంతా తన నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే పవన్ ఇలా కాపులను దగ్గరకు తీస్తున్నట్టు తెలుస్తోంది. కాపులను ఐక్యం చేసే ఉద్దేశంతోనే అన్నయ్య చిరును, జోగయ్యను ఇందులో భాగస్వాములను చేసినట్టు తెలుస్తోంది.
వీరంతా ఉంటే ఖచ్చితంగా కాపు నేతలు, సామాజికవర్గం అంతే ఏకమై.. తనకు మద్దతుగా నిలుస్తారని పవన్ భావిస్తున్నాడు. తద్వారా ప్రత్యర్థులు వైసీపీ, టీడీపీకి చెక్ పెట్టవచ్చని చూస్తున్నారు. నిజంగా కాపులంతా ఈ పరిణామంతో ఏకమైతే రాజకీయంగా వైసీపీ, టీడీపీకి పెద్దదెబ్బగానే చెప్పొచ్చు.
కాపుల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు కాపు నాయకులు మద్దతు ఇప్పుడు తెలుపుతారా? లేదా అన్నది అంతుచిక్కడం లేదు. కాపు సంక్షేమ సేన నేతలు కలిసినంత మాత్రం కాపులంతా వీరి వెంట నడుస్తారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా మంది కాపులు వైసీపీ, టీడీపీ వెంట విడిపోయారు. వారంతా పవన్ కళ్యాణ్ ను నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ఎన్నికల్లో పవన్ కు పట్టం కడుతారా? అంటే ప్రశ్నార్థకమే.
పవన్ ను రాజకీయాల్లోకి వచ్చాక అటు ప్రజలు, ఇటు విభిన్నవర్గాలు అభిమానిస్తున్నా కూడా ఆ అభిమానం ఓటు బ్యాంకుగా మారటం లేదన్నది వాస్తవం.ఇన్నేళ్ల రాజకీయంలో పవన్ కళ్యాన్ కాపుల గురించి పట్టించుకోలేదు. బీసీలు, కాపుల సమస్యలపై కొట్లాడింది లేదు. కుల సమీకరణాలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు తన రూట్ మారుస్తున్నారా? అన్నచర్చకు కాపులతో సమావేశం ఊతమిస్తోంది. కేవలం అభిమానులను నమ్ముకోవడం ద్వారా పార్టీ బలోపేతం కాదని.. బలమైన సామాజికవర్గం పార్టీ వెనుక ఉండాలని ఆయన భావిస్తున్నారేమో అన్న ప్రచారం సాగుతోంది. పంచాయితీ ఎన్నికల వేళ సొంత సామాజికవర్గాన్ని చేరదీయడం వెనుక అసలు కథ అదేనంటున్నారు.